New Ration Cards: రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్న ప్రభుత్వం..?
By
Vaasthava Nestham
ప్రజా పాలనలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది. అర్హులందరికీ కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని, ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. ఇప్పుడు తాము అధికారంలో ఉన్నందున ఈ హామీలను నెరవేర్చడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రేషన్‌కార్డుల సమస్యలపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. దీంతో రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డులు రానున్నాయి.
కొత్త రేషన్ కార్డుల జారీ షురూ...
తెలంగాణలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిశీలించింది. కొత్త రేషన్‌కార్డులకు ఎంతమంది అర్హులో నిర్ణయించారు. రేషన్ కార్డు ఆధారంగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందున ప్రతి నిర్ణయాన్ని అత్యంత జాగ్రత్తగా తీసుకుంటున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై లబ్ధిదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ నేతలు కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి ఇటీవల స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు హామీలను అమలు చేసి కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని ఇళ్లులేని ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇస్తూ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. రేషన్ కార్డు లేని మధ్య తరగతి కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు చేయనుంది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కసరత్తు..
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్లతోపాటు అర్హులందరికీ త్వరలో కొత్త పింఛన్లు, పెరిగిన పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. ఈ హామీలపై రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంతేకాకుండా తన స్వస్థలంగా భావించే పాలేరు నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ పదే పదే హామీ ఇస్తున్నా.. ఈరోజు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని భావించినా.. ఎన్నికల సంఘం ఆంక్షల కారణంగా వాయిదా పడింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రకటన కొత్త రేషన్ కార్డులు మరియు ఇతర సంక్షేమ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న చాలా మంది తెలంగాణ వాసులకు ఆశాజనకంగా ఉంది. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉండటం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సానుకూల ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎంతో కాలంగా రేషన్ కార్డు లేక కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు రేషన్ కార్డులు జారీ కానున్నాయి.
Comments