-Advertisement-

Union Budget 2024-25 : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు: సీఎం రేవంత్ రెడ్డి

Budget highlights 2024 Budget 2024 India budget Budget 2024 income tax Budget 2024 PDF Union Budget 2024-25
Vaasthava Nestham

- అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం


వాస్తవ నేస్తం,హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరసన వ్యక్తం చేశారు. “తెలంగాణ పట్ల పూర్తి వివక్షను ప్రదర్శించారు. కక్ష పూరితంగా వ్యవహరించారు. బడ్జెట్‌ లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు. ఈ రకంగా కక్ష పూరితంగా వ్యవహరించడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు” అని ఆందోళన వ్యక్తం చేశారు. 

🔶 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మంత్రివర్గ సహచరులతో కలిసి ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో స్పందించారు. తెలంగాణ పట్ల ప్రదర్శించిన వివక్షపై అసెంబ్లీలో చర్చ చేపట్టి ప్రభుత్వ నిరసనను కేంద్రానికి తెలియజేస్తామని చెప్పారు. 

🔶 “వికసిత్ భారత్‌లో తెలంగాణ భాగం కాదని కేంద్రం భావిస్తున్నట్టు తాజా వైఖరిని బట్టి స్పష్టమవుతోంది. తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా మూడుసార్లు ప్రధానమంత్రి గారిని కలిసి కోరాం. వివక్ష లేని, వివాదాలు లేని, కేంద్రం, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కలిగి అభివృద్ధికి సహకరించాలని కోరాం. కానీ బడ్జెట్‌లో తెలంగాణ అనే పదాన్నే నిషేధించారు” అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

🔶 “ఇతర రాష్ట్రాల కేటాయింపులపై తమకెలాంటి అభ్యంతరాలు లేవు. విభజన చట్టంలో పొందుపరిచిన మేరకు ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించినప్పుడు అదే చట్టంలో పేర్కొన్న తెలంగాణ అంశాలపై ఎందుకు వివక్ష చూపించారు? ఎందుకు నిధులు కేటాయించలేదు? దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోంది. ఆ వివక్షపై దక్షిణాది రాష్ట్రాలతో కలిసి పోరాటం చేస్తాం. కలిసొచ్చే ప్రభుత్వాలతో మా వైఖరిని కేంద్రానికి స్పష్టంగా చెబుతాం” అని అన్నారు.

🔶 తెలంగాణకు ప్రధానంగా బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీకి నిధులు, ఐఐఎం ఏర్పాటు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు నిధులు, రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు, వరంగల్ ఎయిర్‌పోర్ట్, మరుగున పడిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టు పునరుద్ధరణ, రైతులకు ప్రత్యేక కార్యాచరణ, వైద్య ఆరోగ్యం, విద్య, ఉపాధి కల్పనలో తెలంగాణకు ఏవీ ఇవ్వలేదన్నారు.

🔶 ప్రతి రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేయాలని స్వయంగా ప్రధానమంత్రి గారిని కలిసి విజ్ఞప్తి చేశాం. కానీ తెలంగాణకు ఐఐఎం ఇవ్వబోమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ రాశారు. ఎందుకు ఇవ్వరు? ఎందుకింత వివక్ష? అంటూ నిరసన వ్యక్తం చేశారు. 

రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్పందించాలని అన్నారు. “ఈ వైఖరి ఏమాత్రం సమంజసం కాదు. సహేతుకం కాదు. మా నిరసనను కేంద్రానికి తెలియజేస్తాం” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.