vaasthavanestham.com
Date of Publish : 22 October 2025, 11:29 am Posted by : VAASTHAVA NESTHAM MEDIA

తెలంగాణ రవాణా శాఖ సంచలన నిర్ణయం.. నో చెక్‌పోస్ట్..!

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్ : సరిహద్దులలోని చెక్ పోస్ట్ లు మూసి వేస్తూ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని చెక్‌పోస్టులను తక్షణమే మూసివేయాలని ప్రకటించారు. ఈ ప్రక్రియను ఈరోజు (అక్టోబర్ 22, 2025 )సాయంత్రం ఐదు గంటలలోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కమిషనర్ ఆదేశాలతో రవాణా శాఖలోని అధికారులు, సిబ్బంది వెంటనే చర్యలు ప్రారంభించారు. ఈ నిర్ణయంతో రవాణా శాఖ పరిధిలోని రాష్ట్ర సరిహద్దులు, ప్రధాన రహదారుల వద్ద ప్రస్తుతం ఉన్న అన్ని చెక్‌పోస్టులు మూసివేయనున్నారు. చెక్‌పోస్టుల వద్ద పనిచేస్తున్న సిబ్బందిని ఇతర విభాగాలకు బదిలీ చేయాలని కమిషనర్ ఆదేశించారు. అంతేకాకుండా చెక్‌పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బారికేడ్లు, సూచికలు, కంట్రోల్ షెడ్‌లు తదితరాలను తొలగించాలని సంబంధిత జిల్లా రవాణా అధికారులను ఆదేశించారు. అలాగే చెక్‌పోస్టుల మూసివేత వల్ల వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ విభాగం, రవాణా శాఖ అధికారులు పరస్పరం సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. వాహనదారులు సాధారణంగా ప్రయాణించే మార్గాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా పర్యవేక్షణ బృందాలను కూడా నియమించనున్నారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్