కాళ్ల పారాణి ఆరకముందే మృత్యుఒడిలోకి..
By
Vaasthava Nestham
- అత్తగారింటికి వెళ్తూ నవదంపతుల మృతి
- ఆరు నెలల కిందటే వివాహం
వాస్తవ నేస్తం,ఆంధ్ర ప్రదేశ్ (రైల్వే కోడూర్): ఆ రెండు కుటుంబాల్లో నవధాంపతుల మృతి పండగ పూట విషాదం నింపింది. సంక్రాంతి పండుగ సందర్భంగా నవ దంపతులు ఊరెళదామనుకున్నారు. కానీ వారిని మృతు ప్రమాద రూపంలో కబలించింది. వివాహమైన తర్వాత మొదటి పండక్కి తన అమ్మగారింటికి వెళ్తున్నామన్న సంతోషంలో ఆ వధువు ఉబ్బితబ్బిబ్బయింది. కానీ ఇంతలోనే వారిని విధి వక్రీకరించింది. కాళ్ల పారాణి ఆరకముందే మృత్యుఒడికి చేర్చింది. ఆటోలో వెళ్తున్న వీరిని లారీ రూపంలో మృత్యువు వెంటాడింది. వివాహమై ఆరు నెలలు కాకముందే ఈ ఘోరం జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరై విలపించారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ లోని రైల్వే కోడూరు Andhra Pradesh, railway koduru మండలంలోని రాఘవరాజపురం గ్రామం ప్రధానదారిలో శుక్రవారం బోరు పైపులను తీసుకెళ్తున్న లారీ ఆటోను ఢీ కొనడంతో నవదంపతులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పెనగలూరు మండలంలోని వెలగచర్ల దళితవాడ గ్రామానికి చెందిన ఉదయగిరి భార్గవ్ (24)తో రాజంపేటకు చెందిన లక్ష్మీదేవి (28)కి 5 నెలల కిందట వివాహమైంది. వీరు ప్రస్తుతం రైల్వేకోడూరులో నివాసం ఉంటున్నారు. భార్గవ్ ఒక పెట్రోల్ బంకులో పనిచేస్తూ, ఖాళీ సమయంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రైల్వేకోడూరు నుంచి భార్గవ్ తన సొంత ఆటోలో ఫ్రిజ్, తదితర సామాన్లు తీసుకుని రాజంపేటలోని తన అత్త ఇంటికి భార్యతో సహా పండుగకు వెళ్తుండగా రాఘవరాజపురం ప్రధానదారిలో రాజంపేట నుంచి రైల్వేకోడూరుకు బోరు పైపుల లోడుతో వస్తున్న లారీ ఢీకొంది. దీంతో ఆటో నుజ్జునుజ్జయి ఇరువురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. వెంటనే శవపరీక్ష నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు హుటాహుటిన రాఘవరాజపురానికి చేరుకొని బోరున విలపించారు. భార్గవ్ తల్లి లక్ష్మీదేవి దుఖఃసాగరంలో మునిగిపోయింది. పెనగలూరు మండలంలోని వెలగచర్ల దళితవాడ, రాజంపేట మండలంలోని బలిజపల్లెలో పండుగపూట విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కావడంతో పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
User
Comment Poster
🙏
Vaasthava Nestham
Replied
✅
Reply to This Comment
Comments