Telangana Government: ఇక కల్యాణలక్ష్మి నగదుతోపాటు తులం బంగారం
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,హైదరాబాద్: పేదింటి ఆడబిడ్డల వివాహం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరుతో నగదును అందజేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇక నుండి లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు రాష్ట్ర సర్కార్ ప్రణాళికలు చేస్తుంది. ఈ మేరకు సిఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. బిసి, మైనారిటి గిరిజన శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు చేసినట్లు తెలుస్తోంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలి సమావేశంలో పాల్గొన్నారు. సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సిఎం సూచించారు. గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేందుకు స్థలాలు గుర్తించి, అంచనాలు తయారు చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ నియోజక వర్గంలో బిసి స్టడీ సర్కిల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.
Comments