Shivaji Maharaj jayanti celebrations: ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
By
Vaasthava Nestham
- ప్రధాన ఆకర్షణగా అశ్వాల నృత్యాలు
- ఉత్సాహంతో పాల్గొన్న యువకులు
వాస్తవ నేస్తం,ముధోల్: మండల కేంద్రమైన ముధోల్ లో సోమవారం వీరుడు ఛత్రపతి శివాజి మహారాజ్ 394 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్య మరాఠాల సంఘ భవనంలో పూజలు నిర్వహించి ఆయనకు నివాళులర్పించారు. అదేవిధంగా యశ్వంత్ నగర్ లోని నలంద బుద్ధ వీహార్ ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలను జరిపారు. అనంతరం జయంతి వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున శోభాయాత్ర చేపట్టారు. శోభాయాత్ర మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగి శివాజీ చౌక్ వరకు నిర్వహించారు. ఇట్టి శోభాయాత్రలో డీజే పాటలపై యువకులు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. శోభాయాత్రలో అశ్వాల నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శోభాయాత్ర అనంతరం పలువురు మాట్లాడుతూ హిందూ స్వరాజ్యం కోసం పోరాడిన సాహస వీరుడని కొనియాడారు. ఆయనకు ధర్మం పట్ల ఉన్న నిబద్ధత నేటి యువకులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. శోభాయత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముధోల్ సిఐ మల్లేష్, ఎస్సై సాయి కిరణ్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మరాఠా సంఘ నాయకులు, హిందూ వాహిని, దళిత సంఘాల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments