అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం.. ఆపై హత్య
By
Vaasthava Nestham
- పక్కా ప్లాన్ తో అంగన్వాడీ టీచర్ హత్య
- తర్వాత గొంతుకు స్కార్ఫ్ చుట్టి మర్డర్
- నిందితుల అరెస్టు, బంగారం నగలు, బైక్ స్వాధీనం
వాస్తవ నేస్తం,తాడ్వాయి: అంగన్వాడి టీచర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తాడ్వాయి మండలం కాటాపూర్ అడవిలో జరిగిన అంగన్వాడి టీచర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యపై ములుగు డీఎస్పీ శుక్రవారం వివరాలను వెల్లడించారు. ఏటూరునాగారం మండలం రొయ్యూరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అంగన్వాడి టీచర్ పై అత్యాచారం జరిపి ఆమెను హత్య చేసినట్లు గుర్తించారు. నిందితులను ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక మోటార్ సైకిల్, మూడు తులాల బంగారం గొలుసు, పుస్తెలు, వృద్ధురాలు హ్యాండ్ బాగ్, అందులో ఉన్న బ్యాంక్ పాస్ బుక్స్, ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటారం అడవిలో ఈనెల 14న అంగన్వాడీ టీచర్ హత్యకు గురైంది. ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామంలో పనిచేస్తున్నారు. ఈనెల 14న కాటాపూర్ గ్రామంలో విధులను ముగించుకున్న అంగన్వాడీ టీచర్ చిన్నబోయినపల్లి గ్రామానికి వెళ్లేందుకు బయలుదేరారు. గ్రామంలో బస్సు మిస్ అవ్వడంతో అంతకుముందే పరిచయం ఉన్న ఆకుదారి రామయ్య తాను లిఫ్ట్ ఇస్తానని కాటాపూర్ గ్రామంలో ఆమెను బైకు ఎక్కించుకున్నాడు. అప్పటికే ఆకుదారి రామయ్య కాటాపూర్ సమీపంలోని అడవి వద్ద గల నీళ్ల ఒర్రె వద్ద పగిడి జంపయ్య అనే వ్యక్తిని బైక్ పై దించాడు. కాటాపూర్ నుంచి అంగన్వాడీ టీచర్ తో బైకు పై బయలుదేరిన ఆకుదారి రామయ్య అడవిలో నీళ్ల ఒర్రె వద్దకు ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ ఆకుదారి రామయ్య, పగిడి జంపయ్య ఇద్దరు కలిసి అంగన్వాడీ టీచర్ ను అడవిలో కొద్ది దూరం తీసుకెళ్లారు. ఆమెపై అత్యాచారం జరిపారు. తర్వాత అంగన్వాడి టీచర్ మెడలో ఉన్న బంగారం గోపితాడును లాక్కునే ప్రయత్నం చేయగా ఆమె ప్రతిఘటించారు. ఆమె తలపై రాయితో కొట్టాడు. తర్వాత ఆ రాయిని నీళ్ల ఒర్రెలో పడేశాడు. ఆకుదారి రామయ్య ఆమె చాతిపై కూర్చుని గొంతు నొక్కాడు. తర్వాత ఇద్దరు కలిసి ఆమె స్కార్ఫ్ తో మెడ చుట్టూ ఇద్దరు కలిసి లాగి ఊపిరాడకుండా చేసి అంగన్వాడీ టీచర్ ను చంపారు. తర్వాత ఆమె మెడలోని మూడు తులాల బంగారం గొలుసు, పుస్తెలను తీసుకున్నారు. ఆమె మొబైల్ ఫోన్లని పక్కనే ఉన్న నీళ్ల ఒర్రెలో పడేశారు. ఆమె బ్యాగుని కూడా అడవిలో దూరంగా విసిరేశారు. తర్వాత ఆకుదారి రామయ్య, పగిడి జంపయ్యలు తమ స్వగ్రామమైన ఏటూరునాగారం మండలంలోని రొయ్యూరు వెళ్లారు. మృతురాలి కొడుకు రడం చరణ్ ఫిర్యాదు మేరకు తాడ్వాయి పోలీసులు విచారణ చేపట్టారు. పస్రా ఇన్ స్పెక్టర్ వంగపల్లి శంకర్, తాడ్వాయి ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డిల ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడిన పోలీసులు సీసీ ఫుటేజీల, నిందితుల కాల్ డేటా ఆధారంగా పూర్తి ఆధారాలు సేకరించారు. శుక్రవారం నిందితులను ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పి తెలిపారు.
Comments