అనర్హులకు రేషన్ కార్డులతో ప్రజాధనం వృథా
By
Vaasthava Nestham
- ప్రతి స్కీమ్ కు రేషన్ కార్డే ‘ట్రంప్ కార్డ్’
అర్హులందరికీ రేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాలు అందజేస్తామని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అనర్హులకు రేషన్ కార్డ్ లు తొలగిస్తామని స్పష్టం చేశారు. అయితే ఆ ధైర్యం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలదా? అనే అనుమానం వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో ఇప్పటికే 90 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. మరో 10 నుంచి 15 లక్షల రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. మరోవైపు రేషన్ కార్డులతో ఆధార్ కార్డ్ లింక్ ప్రక్రియ కొనసాగుతున్నది. దీని గడువును కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.
కొత్తవి జారీ చేస్తే ‘కోటి’ రేషన్ కార్డులు..
ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక వాటి అమలుకు కసరత్తు ప్రారంభించింది. 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన పేరిట గ్రామ, పట్టణ, వార్డుల్లో కార్యక్రమాలు నిర్వహించి అభయహస్తం పేరిట దరఖాస్తులను స్వీకరించింది. దీంతోపాటు కొత్త రేషన్ కార్డుల కోసం సైతం దరఖాస్తులను తీసుకున్నది. ఇందులో సుమారు పది లక్షల మంది వరకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే మరో ఐదు లక్షల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. దీంతో సుమారు 15 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తున్నది. కొత్త వాటిని జారీ చేస్తే రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య కోటి దాటే అవకాశముంది.
ఆరు గ్యారెంటీలకు అదే ట్రంప్ కార్డు
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలైనా.. లేదా ఆరోగ్యశ్రీ లాంటి ఏ ఇతర సంక్షేమ పథకాలైనా వాటి ద్వారా లబ్ధి పొందాలంటే రేషన్ కార్డ్ తప్పనిసరి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆహార భద్రత కార్డులు కేవలం రేషన్ కోసమేనని చాలా సార్లు ప్రకటించిన.. ప్రతి పథకానికీ రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకున్నది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబమని నిరూపించేందుకు రేషన్ కార్డే ట్రంప్ కార్డ్ గా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో అమలు చేస్తున్న గృహజ్యోతి, మహాలక్ష్మిలోని గ్యాస్ సిలిండర్ స్కీమ్స్ కు రేషన్ కార్డు తప్పనిసరిగా మారింది. ఇందిరమ్మ ఇండ్లు, చేయూత వంటి స్కీమ్స్ ప్రయోజనాలు సైతం రేషన్ కార్డు ఉంటేనే అందుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆరోగ్యశ్రీ వైద్య సేవలు కూడా రేషన్‌కార్డు ఉన్నవారికే అందుతున్నాయి. దీంతోపాటు స్థానిక ధ్రువీకరణ, ఆదాయ ధ్రువపత్రం మంజూరు కూడా అధికారులు రేషన్‌కార్డు అడుగుతున్నారు. దీంతో రేషన్ కార్డు ఎంత ఇంపార్టెంటో ప్రజలకు అర్థమైంది.
-ఫిరోజ్ ఖాన్, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, 9640466464
రేషన్ కార్డుల కోసం అర్హులను గుర్తించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశాయి. అనర్హులు సైతం రేషన్ కార్డు ద్వారా వివిధ ప్రయోజనాలను పొందుతున్నట్లు గుర్తించి.. వారి రేషన్ కార్డులను తొలగించేందుకు కసరత్తు సైతం చేశాయి. కరోనా అనంతరం అనర్హులు తమ రేషన్ కార్డులను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వంద చదరపు మీటర్ల కంటే ఎక్కువ నిడివి గల ఇల్లు లేదా ఫ్లాట్, కారు లేదా ట్రాక్టర్, గ్రామంలో రూ.2 లక్షల ఎక్కువ వార్షికాదాయం, నగరాల్లో రూ.3 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం గల వారు సంబంధిత తహసీల్దార్‌కు లేదా డీఎస్‌వో ఆఫీసులో గానీ రేషన్ కార్డు సరెండర్ చేయాలని కేంద్రం పేర్కొన్నది. అంతేకాకుండా ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు రేషన్ కార్డు ద్వారా ఆహార ధాన్యాలు సేకరించని వారి రేషన్ కార్డులను సైతం రద్దు చేయవచ్చనే ఆలోచన చేసింది.
‘360 డిగ్రీస్’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం
కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ‘360 డిగ్రీస్’ అనే సాఫ్ట్ వేర్ ను తయారు చేయించింది. ఎన్‌ఐసీ, ఐటీ తదితర శాఖలు సంయుక్తంగా రూపొందించిన ఈ సాఫ్ట్ వేర్ లో ఆదాయపు పన్ను చెల్లించే వారు, ఉద్యోగులు.. ఇలా పౌరులకు సంబంధించి వివిధ శాఖల నుంచి సేకరించిన సమాచారాన్ని పొందుపర్చింది. దీని ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను ఆధార్ నంబర్ల ద్వారా జల్లెడ పట్టింది. ఒకవేళ ఈ సాఫ్ట్ వేర్ లో దరఖాస్తుదారుడికి సమాచారం దొరికితే సదరు అప్లికేషన్ ను తిరస్కరించాలని భావించింది. లేకపోతే సదరు దరఖాస్తును సంబంధిత జిల్లా అధికారులకు పంపేందుకు సిద్ధమైంది. అనర్హులకు చెక్ పెట్టేందుకు ఈ సాఫ్ట్ వేర్ ను ఉపయోగిస్తున్నట్లు అప్పట్లో పౌరసరఫరాల శాఖ చెప్పింది. అంతేకాకుండా కొత్త నిబంధనలు సైతం అప్పటి ప్రభుత్వం తయారు చేసినట్లు ప్రచారం జరిగింది. దరఖాస్తుదారుడు తెలంగాణకు చెందిన వాడై ఉండాలని, ప్రభుత్వ ఉద్యోగం, ఇన్ కం ట్యాక్స్ చెల్లించే వారు, కార్లు, బంగ్లాలు ఉన్న వారు, మూడున్నర ఎకరాల కంటే ఎక్కువ భూమికి రైతుకు బంధు తీసుకుంటున్న వారు.. రేషన్ కార్డులకు అనర్హులుగా ప్రకటించాలని గత ప్రభుత్వం భావించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ 360 డిగ్రీస్ సాఫ్ట్ వేర్ ఫెయిల్ అయినట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఎంతో మంది అర్హుల దరఖాస్తులు సైతం ఈ సాఫ్ట్ వేర్ వల్ల రిజెక్ట్ అయ్యాయని విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ముందుకు సాగించలేదు.
గతంలో రద్దు చేస్తే తీవ్ర విమర్శలు..
రేషన్ షాపుల్లో సరకుల కోటా చాలా వరకు మిగిలిపోతుండడంతో గత ప్రభుత్వం పరిస్థితి గురించి ఆరా తీసింది. చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే సరకులను చాలా మంది తీసుకోవడం లేదని గుర్తించింది. చాలా మంది ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందడానికే మాత్రమే రేషన్ కార్డులను తీసుకున్నారని తేల్చింది. ఈ క్రమంలో ఆదాయపు పన్ను చెల్లించేవారు, కారు కలిగి ఉన్న వారు.. ఇలా పలు రకాలుగా వివరాలను ఆయా శాఖల నుంచి సేకరించింది. ఆ సమాచారం ఆధారంగా కొందరి కార్డులను తొలగించింది. ఆ లెక్కన ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే లక్షకు పైగా కార్డులను రద్దు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగానూ చాలా కార్డులు రద్దయ్యాయి. దీంతో అప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాము అర్హులమని, అయినా తమ కార్డులను తొలగించామని చాలా మంది వాపోయారు.
‘బీపీఎల్’ ప్రమాణాలను పెంచి రూల్స్ వర్తింపజేయాలి
రాష్ట్రంలో ప్రస్తుతమన్న 90 లక్షల కార్డుల్లో ఇరవై శాతానికి పైగా అనర్హుల చేతుల్లోనే ఉన్నాయనే చర్చ ఉంది. కార్లు, పెద్దపెద్ద బంగ్లాలు కలిగి ఉండి నెలకు లక్షల రూపాయలు అద్దెల రూపంలో తీసుకుంటున్న వారు సైతం రేషన్ కార్డ్ కలిగి ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో కోట్లాది రూపాయలు కూడబెట్టుకున్న వారు సైతం రేషన్ కార్డు ద్వారా వివిధ సంక్షేమ పథకాలు పొందుతున్నారు. కోట్లాది రూపాయల ఇండ్లలో ఉంటూ గృహజ్యోతి, మహాలక్ష్మి వంటి స్కీమ్స్ ను యూజ్ చేసుకుంటున్నారు. అదే సమయంలో కాంట్రాక్టు, ప్రైవేటు ఉద్యోగులు ప్రభుత్వ నిబంధనల వల్ల రేషన్ కార్డ్ పొందలేక అనేక రకాల స్కీమ్స్ కు దూరమవుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు రూపొందించి రేషన్ కార్డులు మంజూరు చేస్తేనే అర్హులకు లాభం జరిగే అవకాశముంది. ఇందుకోసం ముందుగా ‘బీపీఎల్’ ప్రమాణాలను మార్చాల్సిన అవసరముంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ. లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో ఏడాదికి రూ. రెండు లక్షల లోపు ఆదాయం ఉన్న వారిని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిగా ప్రభుత్వం గుర్తిస్తున్నది. ఈ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రూ. 4లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 5 లక్షలుగా పెంచితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. యెల్లో ప్లేట్ కార్లను మినహాయించి వైట్ ప్లేట్ కార్లు కలిగిన వారు, నివాస యోగ్యానికి అదనంగా ఉన్న స్థలాల్లో షట్టర్లు, మడిగీలు వేసి అద్దెలు పొందుతున్న వారు, రూ. 7 లక్షలకు పైగా సంపాదిస్తూ ఐటీ కడుతున్న వారు, ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ 7 లక్షలకు పైగా సంపాదిస్తున్న వారి వద్ద రేషన్ కార్డులు ఉంటే వాటిని రద్దు చేసి.. అర్హులకు అందిస్తే బాగుంటుంది. గతంలో రేషన్ కార్డు మంజూరు చేసినప్పుడు రూల్స్ సరిగా వర్తింపజేయలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అనర్హులకు రేషన్ కార్డులు దక్కాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో రేషన్ కార్డుల ఏరివేతకు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించిన.. రాజకీయ కారణాల వల్ల ముందుకు సాగలేదు. లక్షకు పైగా కార్డులు రద్దు చేసినా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆ ప్రోగ్రామ్ ను అక్కడే ఆపేశారు. అయితే విమర్శల భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం అనర్హులకు రేషన్ కార్డులను రద్దు చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుందా? అనేది అనుమానంగా ఉన్నది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అర్హులకు న్యాయం చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రిస్క్ తీసుకోక తప్పని పరిస్థితి ఉంది. అర్హులకు న్యాయం చేయాలంటే కాంగ్రెస్ ఆ మాత్రం ధైర్యం చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వ్యాసకర్త: -ఫిరోజ్ ఖాన్, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, 9640466464
Comments