-Advertisement-

కేజీబీవీ విద్యార్థుల ఆందోళన వెనుక ఎవరున్నారు...?

Vaasthava Nestham
- విద్యార్థులు పాఠశాల బయటకు రావడానికి కారకులు ఎవరు..?
- జిల్లా అధికారుల నియంత్రణ లోపమా..!
- విద్యార్థులకు కస్తూర్బా ఉపాధ్యాయులు ఉసి గొల్పారా..?
- జిల్లా అధికారులు కేజీబీవీ ఉపాధ్యాయులకు సహకరిస్తున్నారా.. ?

రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు, కస్తూరి పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది తమ విధులను బహిష్కరించి నిరవదిక దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. కాగా రాష్ట్ర ప్రభుత్వం కస్తూరి పాఠశాలలతో పాటు ఆశ్రమ పాఠశాలలకు ప్రభుత్వ ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ ఇన్చార్జులుగా నియమించి, విద్యార్థులు నష్టపోకుండా తరగతులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ జిల్లావ్యాప్తంగా ఆయా కస్తూరి పాఠశాలల్లో శనివారం విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు ఆందోళన చేపట్టడం వెనుక ఉన్నతాధికారులు, ఉపాధ్యాయుల హస్తం ఉందని పలువురు అనుమానిస్తున్నారు. ఓ పక్క న్యాయం కోసం ఉద్యోగులు సమ్మె చేస్తుంటే జిల్లా అధికారులు విద్యార్థులకు నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ గాలికి వదిలేసినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఉన్నత అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తున్నారని అంటున్నారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తతో జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ విద్యార్థులను నియంత్రించడంలో పూర్తిగా విఫలం చెందారా..? లేక కావాలని ఉద్యోగులకు సపోర్ట్ చేస్తున్నారా తెలియాల్సి ఉంది.

విద్యార్థుల ఆందోళన వెనక ఉన్నది ఎవరు...?

గత 20 రోజుల నుండి విద్యార్థులు ఆయా పాఠశాలల్లోనే ఉంటూ చదువుకుంటుండగా తాజాగా ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయులను ఇన్చార్జీలుగా నియమించింది. నియమించిన రెండు మూడు రోజుల్లోనే విద్యార్థులు ఆందోళన చేపట్టడం వెనుక ఎవరు ఉన్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.... విద్యార్థులకు కావాలని ఆయా సంబంధిత ఉపాధ్యాయులు రెచ్చగొట్టి ఆందోళన చేపట్టేలా ప్రేరేపించారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు... దానికి జిల్లా అధికారులు మద్దతు తెలిపినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. 

విద్యార్థులు బయటకు రావడానికి కారకులు ఎవరు..?

శనివారం ఆయా కస్తూరిబా పాఠశాలల్లో విద్యార్థులు మూకుమ్మడిగా గేట్ బయటకు వచ్చి ఆందోళన చేయడానికి అసలు కారకులు ఎవరు..? ఇప్పటివరకు విద్యార్థులు సంబంధిత ఉపాధ్యాయుల అనుమతి లేనిదే గేటు బయటకు అడుగుపెట్టేవారు కాదు. అలాంటిది శనివారం విద్యార్థులు బయటకు ఎలా వచ్చారు.. వారిని బయటకు ఎవరు పంపారు... ప్రభుత్వం ఇన్చార్జిలుగా ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించగా విద్యార్థులు బయటకు ఎలా వచ్చారు. వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జిల్లా విద్యాశాఖ అధికారిపై ఎంతైనా ఉంది.
 
జిల్లా అధికారుల నియంత్రణ లోపమా..!

అసలు విద్యార్థులు బయటకు వచ్చి ఆందోళన చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఇప్పుడు తాజాగా ఉద్భవిస్తున్న ప్రశ్న. విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఉన్నట్టుండి విద్యార్థులు బయటకు ఎలా రాగలిగారు.. ఆందోళన ఎలా చేశారు. ఉండతాధికారులు ఇన్చార్జి ప్రత్యేక అధికారులకు సరైన ఆదేశాలు జారీ చేయలేదా..? జారీచేసిన అక్కడి ఇన్చార్జి ప్రత్యేక అధికారులు విద్యార్థులు బయటకు వస్తుండగా ఏం చేశారు... వీటన్నింటినీ గమనిస్తే జిల్లా అధికారుల నియంత్రణ లోపం కండ్లకు కట్టినట్లుగా కనిపిస్తుందని విద్య వేత్తలు, జిల్లావాసులు ఆరోపిస్తున్నారు. 

కస్తూర్బా ఉపాధ్యాయులు ఉసిగొల్పారా..

శనివారం మూకుమ్మడిగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వివిధ సాకులు చెబుతూ బయటకు వచ్చి ఆందోళన చేయడం వెనుక సంబంధిత ఉపాధ్యాయుల పాత్ర ఏమైనా ఉందా..? అసలు ఒక కస్తూరిబా పాఠశాలలో బొద్దింక వచ్చిందని విద్యార్థులు ఆందోళన చేపట్టగా, వెంటనే వారి తల్లిదండ్రులకు ఎలా తెలిసింది.. విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడకు అంత త్వరగా ఎలా చేరుకున్నారు.. ఇవన్నీ ప్రశ్నలు జిల్లా వాసులలో ఉత్పన్నమవుతున్నాయి. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ఉసిగొలిపారా ..? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా అధికారులు సహకరిస్తున్నారా...?

శనివారం విద్యార్థులు బయటకు వచ్చి ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. కాగా ఇవన్నీ జరగడానికి జిల్లా అధికారులు సహకరించారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లా సంబంధిత అధికారులు నిరవధిక దీక్ష చేపడుతున్న ఉద్యోగులకు పరోక్షంగా సహకరిస్తున్నట్లు పలువురు విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. దీంతోనే విద్యార్థులు స్వేచ్ఛగా బయటకు వచ్చి ఆందోళన చేసినట్లు ఆరోపిస్తున్నారు. వారి వారి స్వార్థం కొరకు విద్యార్థులను బలి చేయొద్దని, అసలే పరీక్షల సమయం దగ్గరకు వచ్చిందని, ప్రభుత్వం మరిన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లైనా చేసి విద్యార్థుల నష్టపోకుండా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
- వెంకగారి భూమయ్య, సీనియర్ జర్నలిస్ట్ , 9848559863
Comments
 -Advertisement-