-Advertisement-

Kupti Project : ప్రజాపాలనలో కుప్టీ బహుళార్థ సాధకామవ్వాలి..!!

Vaasthava Nestham
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ప్రత్యేక తెలంగాణలో వివక్షకు గురైన ప్రాంతాలను ప్రాజెక్టులను ఆధునిక హంగులతో నిర్మిస్తామని, రైతులకు ఉపయోగపడేసాగ, తాగునీటి ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల అందించి పూర్తి చేస్తామని, కుప్టీ ప్రాజెక్టును కట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి మేలు చేస్తామని ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో రెండు పర్యాయాలు హామీ ఇచ్చిన సందర్భంగా రాబోతున్న పూర్తిస్థాయి బడ్జెట్లోనైనా కుప్టీ బహుళార్థ సాధక ప్రాజెక్టు పై ముంపు ప్రాంతాల్లో ప్రాజెక్టు నిర్మాణం పై అపోహలు, ప్రజా పాలనలో వచ్చే సంక్షేమ పథకాలైన ఇందిరమ్మ ఇండ్లు, మౌలిక వసతుల కల్పన, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ నడుస్తున్న సందర్భంలో సృష్టికర్త సైతం పరవశించే ప్రకృతి అందాలు,లేళ్లు సెలయేళ్ల పరుగులు తన్మయత్వంతో ప్రవహించే నది జలాల మీద పాలనురుగులు, భూతల స్వర్గాన్ని సాక్షాత్కరింపజేసే సప్త గుండాలు, నల్లటి నేలలో తెల్లటి బంగారు గనులు కలిగి, అడవిని,అస్తిత్వాన్ని కాపాడుతున్న ఆదివాసిగిరిజన గుడేలు, పశుసంపదను కాపాడే లభాన మథురాలు, భిన్నత్వంలో ఏకత్వం చూపించి మరాఠాలు, కాందిశీకులుగా జీవనం కొనసాగిస్తున్న ముల్తానీలు, వ్యవసాయమే పరమావధిగా జీవిస్తున్న సబ్బండ వర్గాలు శిశిరం రావడంతోటే ఎడారి ఎండమావుల విచిత్ర రూపాన్ని ఆవిష్కరిస్తున్న ప్రకృతి మాత పూర్తి స్వరూపం మారాలని ఆర్మూర్, అంకాపూర్ రైతుల లాగా మూడు పంటలు పండించాలని ఆశతో ఈ కరువు నేలపై కల్పతరువుగా ఈ ప్రజాపాలనలోనైనా కుప్టీ బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణమై 'ద లేక్ సిటీ ఆఫ్ అదిలాబాద్' పేరు సార్థకతమవుతుందని ఈ ప్రాంత ప్రజల చిరాకాల ఆకాంక్ష..

తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు పశ్చిమ కనుమలలో పుట్టి బోథ్, బజార్హత్నూర్ మండలాల వాగులు పిల్లకాలువలతో కొండాకోనలు దాటి కుప్టీగ్రామం వద్ద విశాల ఉదృత ప్రవాహంగా కనబడుతూ కడెం ఉపనదిలో కలుస్తూ పవిత్ర గోదావరి జలాలతో ఏకమవుతు కడెం ప్రాజెక్టును నింపుతూన్న జలాలకు నిలకడ నేర్పి పై భాగంలో నేరడిగొండ మండల పరిధిలోని కుప్టీ గ్రామం వద్ద కడెం మిగులు జలాలను ఒడిసిపట్టి బోథ్ నియోజకవర్గ ప్రజలకు బహుళ అవసరాల కోసం నిర్మించే ప్రాజెక్టు కుప్టీ ప్రాజెక్టు అతి తక్కువ భూసేకరణ కలిగి కేవలం మూడు గ్రామపంచాయతీలలో నాలుగు రెవెన్యూ గ్రామాలు పూర్తిగా, రెండు రెవెన్యూ గ్రామాలు పాక్షికంగా కుప్టీ, కుమారి, గాజిలి, గాంధారి, ముల్కల్ పహాడ్, రాయపూర్ గ్రామాలలో దాదాపు 3000 ఎకరాల భూ సేకరణతో, ఏడు నుంచి పది టీఎంసీల నీరు నిల్వచేసి కడెం ప్రాజెక్టుపై రెండవ పంటకు ఆధారపడిన ఆయకట్టు స్థిరీకరణకు, బోథ్ నియోజకవర్గం లో నేరేడుగోండ, సిరికొండ, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, బజార్హత్నూర్ మండలాలలో నూతనంగా దాదాపు 30 వేల ఎకరాలు ఆరుతడి పంటలకు సాగులోకి తీసుకురావచ్చు  

సాగునీటి కటకట తీర్చేలా..


బోథ్ నియోజకవర్గ పలు మండలాల్లో సుమారు 300 గిరిజన గ్రామాలు పూర్తి అడవి, కొండ ప్రాంతాల్లో ఉండటం వేసవి కాలానికి ముందే జనవరి చివరి వారాల నుండి వాగులు, నీటి చెలిమేలు, చిన్నస్థాయి కుంటలు ఎండిపోవడం వల్ల, పర్వతప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోవడం మూలంగా ఈ ప్రాంతంలో నివసించే ప్రజానీకానికే కాకుండా వారు పెంచుకుంటున్న పశు సంపదకు తాగటానికి నీరు దొరకడం లేదు దీన్ని ఆసరాగా తీసుకొని కొందరు దళారులు గిరిజనుల దగ్గర పోగైన పశు సంపదను మార్కెట్ ధర కంటే తక్కువగా తీసుకొని రైతుకు ఆర్థిక దోపిడీ చేస్తున్నారు ఒకవేళ కూప్టీ ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వస్తే భూగర్భ జలాలు పెరగడమే కాకుండా, ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా రెండు మూడు రోజులకు ఒకసారి అందిస్తున్న నీటిని క్రమం తప్పకుండా రోజు అందించడం వల్ల బక్క జీవుల డొక్కలకు ప్రాణాన్ని ఇచ్చి జీవజలం పోసినట్టు అవుతుంది 

సాగునీటి లభ్యత..


జనవరి నెల వరకు దాదాపు రోజుకు వందలాది మోటార్ పంప్ సెట్లు ఈ వాగులపై రైతుల పొలాలను తడుపుతున్న జీవనది లాగా ఊటలురుతోనే వందల క్యూసెక్కుల నీరు కడెం నదిలో కలుస్తోంది. కానీ గత ప్రభుత్వాలు ఇచ్చిన జీవ ప్రకారం కుప్టీ ప్రాజెక్టు కేవలం కడెం ప్రాజెక్టుకు నీటి నిలువ తక్కువగా ఉన్నప్పుడు, కడెం ఆయకట్టు రెండవ పంట స్థిరీకరణ కోసం కేవలం బ్యాలెన్స్ రిజర్వాయర్ గా మాత్రమే జీవో లలో చూపించారు కానీ ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ ప్రాంత రైతుల మనోభావాలను పరిగణలోకి తీసుకొని నల్లరేగడి నేలల్లో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, జొన్న, పెసర మినుము కందులు తక్కువ నీటితో పండే కూరగాయలు ఆకుకూరలు సాగు చేసుకునే విధంగా మూడు నుండి నాలుగు తడులైన అందే విధంగా, ఈ ప్రాంత రైతులకు ఈ నీటిపై యాజమాన్య హక్కులు కలిగి ఉండే విధంగా సమతల ప్రాజెక్టు లేదా లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కింద అయిన మూడు టీఎంసీలకు తగ్గకుండా బోథ్ నియోజకవర్గ రైతులకు సాగునీరు ఇచ్చే విధంగా , ఈ ప్రాంతం నుంచి వలసలు తగ్గే విధంగా, ఆత్మహత్యలు నిరోధించే విధంగా, ఆదివాసీ గిరిజనుల లో పోషకాహారం లేకుండా ఆకలి చావులు లేకుండా అటు అడవిని ఇటు పంట పొలాలను కాపాడుకుంటూ జీవ వైవిధ్యాన్ని కాపాడే విధంగా ఈ ప్రాజెక్టు నీటిని మనం వాడుకోవచ్చు ఈ ప్రాజెక్టు నిర్మాణం అయితే ఈ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల పైన కట్టిన చెక్ డ్యామ్లలో బోథ్ బజార్హత్నూర్ రైతులకు ప్రయోజనం కలుగుతుంది, అంతేకాకుండా ఈ ప్రాజెక్టు పైన ఉన్న చిన్న తరహా చెరువులైన దేగామ, అడేగామా, కరత్వాడ చెరువుల్లో రైతులకు మరింత అదనంగా నీరు వారి పంట పొలాలకు చేరుతుంది.

• పర్యాటకం అభివృద్ధి..


హైదరాబాద్-నాగ్ పూర్ మధ్య పర్యాటక రంగానికి నూతన శోభ ఈ ప్రాజెక్టు వల్ల కలుగుతుంది ప్రాజెక్టు పక్కనే దాదాపు 400 హెక్టార్లలో నూతన కుంటాల సోమన్న హరితవనం అర్బన్ పార్కు ఏర్పాటు చేయటం, రోడ్డు పక్కనే పెద్ద ప్రాజెక్టు నిర్మాణం పర్యాటకులను కట్టిపడేసే సుందర మనోహర దృశ్యాలు ఉండడం వల్ల,అక్కడే రిసార్టులు కట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉండడం, ఆసియాలోని రెండవ అతిపెద్ద ప్రకృతి సహజ సిద్ధ జలపాతం కుంటాల, సప్త గుండాలలో ముఖ్యమైన పోచ్చేరా, కనకాయి, కొరటికల్, జలపాతాలకు 12 నెలల పాటు పర్యాటకులు రావడం వల్ల ఈ ప్రాంతంలో వ్యాపారం అభివృద్ధి చెందటమే కాకుండా, కొందరికి ప్రత్యేక ఉపాధి అవకాశాలు లభిస్తాయి, ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది.

• విద్యుత్ ఉత్పత్తి..


కూప్టీ ప్రాజెక్టు గత ప్రభుత్వాలు ఇచ్చిన ప్రాజెక్టు డిజైన్లలో మూడు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎత్తిపోతల పథకానికి అవసరమయ్యే విద్యుత్ ఉత్పత్తిని కూడా ఈ ప్రాజెక్టు నుంచే తయారు చేసే అవకాశం ఉందని ఇటు సాగునీటి రంగం నిపుణులు, విద్యుత్ నిపుణులు సూచిస్తున్నారు ఒకవేళ ఇదే సాధ్యమైతే ప్రభుత్వానికి ఒత్తిడి లేకుండా, ఆర్థిక భారం పడకుండా లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని కూడా కొనసాగించవచ్చు.


• జీవవైవిద్యం-వన్యప్రాణి సంరక్షణ..


ఈ ప్రాజెక్టు పూర్తిగా అటవీ ప్రాంతాలకు అనుకొని ఉండటం వల్ల మూడు కాలాలపాటు నీటి వసతి ఉండడం వల్ల , ఎత్తయిన కొండ కోనలు దాటుతూ కడెం వరకు ప్రవహిస్తుంది కాబట్టి ఈ మార్గం వెంబడి వన్యప్రాణి సంరక్షణ తోపాటు జీవవైవిద్యం కూడా ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి కలిసి వస్తుంది అంతరించిపోతున్న జీవజాలాన్ని కాపాడుకోవడంలో ఈ ప్రాజెక్టు కూడా భాగస్వామ్యం కావడం పర్యావరణానికి దోహదం చేయడం ఉపయోగకరమైన అంశం..

• నూతన డిపిఆర్..


ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టులను ప్రకటించడం వాటిని ప్రజలు వ్యతిరేకించడం ఉదాహరణకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లగచర్ల ఫార్మా ప్రాజెక్టు, దిలావర్పూర్ ఈతనల్ పరిశ్రమ ఘటనలను పరిగణలోకి తీసుకొని ప్రజా ఆమోదయోగ్యమైన, ప్రజల భాగస్వామ్యం కలిగిన డిపిఆర్ తయారుచేయాలి, ముంపు ప్రాంతాలలో గ్రామసభలు నిర్వహించి బాధితులకు అందించే నష్టపరిహారం, చెల్లింపు విధానం, పునరావాసం, మిగులు భూమి సేకరణ, భూమిలేని పేదలకు నిర్ణీత గడువులోగా చెల్లింపులు, రుణ సహాయం లాంటివి ముందుగానే ముంపు గ్రామ ప్రజలకు తెలియజేసి ఈ ప్రాంత పరిస్థితులను బేరీజు వేసుకొని కడెం ఆయకట్టు స్థిరీకరణతో పాటు ఈ ప్రాంత ప్రయోజనాలను గుర్తించి త్రాగునీరు, సాగునీటికి లిఫ్ట్ ఇరిగేషన్, ప్రాజెక్టులో నీటి వాటాలపై ఈ ప్రాంత ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించే విధంగా నూతన డిపిఆర్ అధికారుల సిద్ధం చేయాల్సి వస్తుంది.

ఎండాకాలం తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా భూమి పగుళ్లు తీయడం, అటవీ పర్వత ప్రాంతాలనుండి ఏకకాలంలో అనేక వాగులు పిల్ల కాలువలు రావడం వల్ల మధ్యలో వాటి వేగాన్ని నియంత్రించే ఎటువంటి నిర్మాణాలు లేకపోవడం వల్ల ఇసుక, మట్టి మేటలు పెట్టడం వల్ల కడెం ప్రాజెక్టు ఇప్పటికే పూడికతీయులతో నిండిపోయి తన పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయింది, పూర్తిగా మట్టి మీటలు వేయడం వల్ల వరద ప్రవాహ వేగానికి కడం ప్రాజెక్టు కోతకి గురవుతుందా, ఈ ప్రమాదం ప్రళయంగా మారుతుందా అనే భావన గత వర్ష కాలంలో మనమంతా చూసిందే, కాబట్టి కడెం ప్రాజెక్టుకి వరదల్ని నియంత్రించాలన్న, పుడికతీత సమస్య తీరాలన్న పైన కుప్టీ ప్రాజెక్ట్ కట్టి తీర వలసిందే, గత నెల రోజుల కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన ప్రాజెక్టులలో పూడికతీత కార్యక్రమాన్ని కడెం ప్రాజెక్టులో మొదలుపెట్టింది మనకు తెలిసిందే 

నాడు పీసీసీ అధ్యక్షులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంత పర్యటన సందర్భంలో, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి గారు, అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ సమీక్షలో ఉత్తంకుమార్ రెడ్డి గారు ఈ కుప్టీ ప్రాజెక్టుపై పలుమార్లు సమీక్షించిన నేపథ్యంలో అదే కాకుండా అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్లో నిధుల విడుదల చేయడం వల్ల ప్రాజెక్టు ఆశలు చిగురించిన ఈ నేపథ్యంలో రాబోతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంప్రకటించే ఆర్థిక సంవత్సరానికి ప్రకటించే పూర్తిస్థాయి బడ్జెట్లోనైనా ఈ ప్రాజెక్టుకు అడ్డుగా ఉన్న అన్ని రకాల అవరోధాలను పక్కకు నెట్టి, కడెం ఆయకట్టు రైతాంగం తో పాటు, బోథ్ నియోజకవర్గ రైతాంగం హర్షించే విధంగా నూతన డిపిఆర్ సిద్ధం చేసి లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు తాగునీటి కేటాయింపులు జరిపి కుప్టీ ప్రాజెక్టును కట్టడంలా మాత్రమే చూడకుండా కల్పతరువు లాగా భావించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనలోలైన కుప్టీ బహుళార్థ సాధక ప్రాజెక్టు సార్ధకమయ్యేటట్టు 
ఒక సంవత్సర కాలంలో 54 వేల కోట్లు రైతు సంక్షేమానికి ఖర్చుపెట్టి రైతును రాజుగా చేయడానికి కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పూర్తి అంచనా వ్యయం అయిన 1500 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయగలిగితే బోథ్, ఖానాపూర్, మంచిర్యాల నియోజకవర్గంలోని లక్షేట్టిపేట్ ప్రాంతం వరకు రైతులు ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గుండెలపై పచ్చబొట్టు పొడుస్తున్నట్టుగా గుర్తుంచుకుంటారు, ఈ ప్రజా ఆమోదయోగ్యమైన ప్రాజెక్టుకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరాకాల కోరికను నెరవేర్చడం ఈ ప్రజా ప్రభుత్వ బాధ్యత అవుతుంది, ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు అధికార యంత్రాంగం ఈ ప్రాంత రైతాంగం వ్యవసాయాన్ని నిరంతర పండుగగా జరుపుకోవడానికి కృషి చేస్తారని ఆశిస్తూ ఆ విధంగా ఈ ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్లి ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నిర్మాణం జరిపే గురుతర బాధ్యతను ఈ ప్రజా ప్రభుత్వానిదేనని ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంత రైతన్నలను ఆదుకోవాలని ఆశిద్దాం!!
Comments
 -Advertisement-