PM MODI : మోదీ ఆదిలాబాద్ కు ఏం చేశారు..??
వివక్షకు గురవుతున్న, అణచివేతకు గురవుతున్న, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ప్రాంతం, రాజకీయ ఏకీకరణ లేకుండా పాలకుల మాటలు విని అస్తిత్వాన్ని కోల్పోతున్న ప్రాంతం అక్షర క్రమంలో ముందున్న అభివృద్ధికి నోచుకోని ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.. ఆదిలాబాద్ ఆదివాసి జిల్లా అని, అక్షర క్రమంలో ముందున్న జిల్లా అని, అమాయకుల జిల్లా అని, దీన్ని గత పాలకులు అభివృద్ధికి దూరంగా ఉంచారు మేం అధికారంలోకి వస్తే అభివృద్ధిని పరుగులెత్తిస్తాం అని చెప్పడం తప్పితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నుండి నేటి ప్రత్యేక తెలంగాణ వరకు ఎక్కడి సమస్యలు అక్కడే ఉండి ఇంకా జఠిలమైనవి తప్పితే పరిష్కారం దిశగా ముందడుగు పడని పరిస్థితి అభివృద్ధి అనేది అదిగో పులి.. ఇదిగో తోక..! అన్న చందంగా ఉండింది.
యూనివర్సిటీ లేని జిల్లాగా చరిత్ర పుటల్లో..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అప్పటి ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైయస్ ( Ys Raja Shekar reddy ) రాజశేఖర్ రెడ్డి గారు ఉట్నూర్ కేంద్రంగా గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనేది అప్పటి ప్రభుత్వం అంగీకారం తెలపడం అంతలోనే వారు సీఎంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి మృతి చెందడం, రోశయ్య గారు పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో వరదలు సంభవించడం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రావటం అస్తిత్వం కోసం ఆత్మగౌరవ పోరాటంలో నీళ్లు నిధులు నియామకాలకై జరిగిన పోరాటంలో నిమగ్నమై ప్రత్యేక తెలంగాణ సాధించి కేంద్రాన్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లో తెలంగాణకు ప్రత్యేక సెంట్రల్ యూనివర్సిటీ అనే పదాన్ని చేర్చగలిగింది కేవలం ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులే, కానీ మా త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ టిఆర్ఎస్ సర్కార్ 6-7 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంత పరిస్థితులను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా, ఇక్కడి మంత్రులు ఎమ్మెల్యేల మాటలు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పెడచెవిన పెట్టి వీరిని కరివేపాకు లాగా తీసేసి ఇక్కడ ఉట్నూర్ కేంద్రంగా ఏర్పాటు కావలసిన గిరిజన యూనివర్సిటీని ములుగు జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, కేంద్రం అనుమతి ఇవ్వడం, దానికి సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ గా నామకరణం చేయడం అన్ని ఈ జిల్లాకు సంబంధం లేకుండానే జరిగిపోయినవి, ఉమ్మడి రాష్ట్రంలో ఐఐటీ తరలిపోయింది, ఈ 10 సంవత్సరాల పాలనలో, నూతన జిల్లాలు ఏర్పడిన తర్వాత కనీసం కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాలను ఇవ్వడం, కేంద్రీయ విద్యాలయాలను ఇవ్వడం, సైనిక్ స్కూల్ లను ఇవ్వడం మర్చిపోయి కేవలం రాజకీయ ఓటు బ్యాంకు పైనే ఆధారపడి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశాయి. అంతేకాకుండా సమ ప్రాధాన్యం ఉన్న కాశ్మీర్ ప్రాంతంలో లధ్ధాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో యుజిసి నిబంధనలు మర్చి, సెంట్రల్ యూనివర్సిటీ యాక్ట్-2009 నీ సవరించి 750 కోట్ల రూపాయలతో కేంద్ర విశ్వవిద్యాలయం ప్రకటించింది, కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా రెండుసార్లు పార్లమెంట్ సభ్యులుగా ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి బిజెపి లీడర్లను పంపిన వీరిని పట్టించుకోకుండా తెలంగాణ కాశ్మీరం అయినటువంటి ఆదిలాబాద్ జిల్లాను, ఉపఖండం పరిస్థితులు కలిగి ఆదివాసీ గిరిజన జనాభా అధికంగా ఉన్న మధ్య ఆదిలాబాద్, బెంగాలీలు, మన్నెపు తెగలు ఉన్న తూర్పు ప్రాంతాన్ని విడిచి, గోదావరి తీర ప్రాంతం పై మరిన్ని ప్రయోగాలు జరగవలసి ఉన్న, సింగరేణి నిధులు ఉన్న, చుట్టూ జలవనరులు ఉన్న, వ్యవసాయంపై పూర్తిస్థాయి సమగ్ర శాస్త్రీయ సర్వే చేపట్టి జీవన విధానంలో మార్పు తీసుకురావలసిన అవసరం ఉన్న, శాస్త్ర సాంకేతిక రంగాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయవలసి ఉన్న, టెక్నాలజీ-జనరల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి అన్ని రకాల వసతులు, సౌకర్యాలు ఉన్న ఇక్కడి కేంద్ర ప్రభుత్వ పెద్దల అలసత్వం వల్ల యూనివర్సిటీ కాకుండా విద్యా రంగం తిరోగమనానికి గురవుతుంది.
అస్తవ్యస్తంగా వైద్యరంగం..
మానవుడు ప్రకృతి మీద ఆధారపడి తన జీవనానికి అవసరమైన ఆహారాన్ని, జీవన గమనానికి అతి ముఖ్యమైన వైద్య ని కూడా ప్రకృతి మీద ఆధారపడి సేకరించాడు ప్రకృతి విధ్వంసం కానీ ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు ఏజెన్సీ ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో ఇంకా నవజాత శిశువుల మరణాలు, రక్తహీనతతో బాలింతల మరణాలు, సీజనల్ అంటూ వ్యాధులతో, టైఫాయిడ్ విరోచనాలు వంటి చిన్న చిన్న రోగాలతో ఈ ఆధునిక కాలంలో మరణాలు జరగడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు శాపగ్రస్తమే అవుతుంది సీజనల్ వ్యాధులు సంభవించే సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందస్తు ప్రణాళిక లేకపోవడం, ఆరోగ్య మెలకువలు లేకుండా ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన తెలపకుండా, ప్రభుత్వవైద్యంపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల సంపాదించుకున్న కొద్ది మొత్తాన్ని అద్దాలమేడలలో ఉండే అద్దె డాక్టర్లకు తమ ప్రాణాలతో పాటు పైసలు ధారబోస్తున్నారు ఈరకంగా ఆర్థిక దోపిడీకి గురవుతున్న సంఘటనలు కోకొల్లలు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వస్తున్న పథకాలు కనీసం పల్లెల్లోనికి అంబులెన్స్ కూడా తీసుకువెళ్ళు లేకుండా ఉన్నాయి , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మ్యాచింగ్ గ్రాంట్లు విడుదల చేసి ప్రజారోగ్యం, పోషకాహార లోపాన్ని నివారించడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజల జీవన త్వరలో మార్పు రావడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి జిల్లా కేంద్రాలలో ఉన్న మెడికల్ కళాశాలలతో పాటు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరిపి అందులో పూర్తిస్థాయి సిబ్బందిని ఏర్పాటు చేసి అత్యాధునిక అధునాతనమైన శాస్త్రీయ వైద్యం అందుకునే స్థాయికి ఈ ఆదిలాబాద్ జిల్లా ముఖ్యంగా పివిటిజి తెగలు చేరుకోవాలని ప్రజల ఆకాంక్ష..
ఉపరితల రవాణా వ్యవస్థ...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పూర్తిగా ఎక్కువ మొత్తంలో అటవీ ప్రాంతం ఉండడం, కొండ ప్రాంతాలు, ఘాట్ రోడ్డులో ఉండటం, మారుమూల ప్రాంతాల్లో ఉండటం దీనికి తోడు ప్రభుత్వం నూతనంగా తెచ్చిన అటవీ చట్టాల వల్ల పైన తెలిపిన ప్రాంతాలకు కలెక్టర్ పరిధిలో వచ్చే అన్ని రకాల రోడ్డు పర్మిషన్లు నేను ఢిల్లీకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి ఈ జిల్లాలో చూస్తాం, అంతేకాకుండా వర్షాకాలం వచ్చిందంటే నదులు వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహించడం వల్ల వర్షాకాల ప్రభావం తగ్గేవరకు బాహ్య ప్రపంచంతో సంబంధం లేని గ్రామాలు అనేకం అంబులెన్స్ సేవలు అందకుండా, నట్టడవిలో, నది ఒడ్డున ప్రసవాలు సర్వసాధారణమైన పరిస్థితి ఈ ప్రజా ప్రభులకు తెలియదా ఇప్పటికైనా వైద్యరంగంపై ప్రత్యేక కేటాయింపులు జరపాలని పలు స్వచ్ఛంద సంస్థలతోపాటు, మేధావులు కోరుతున్నారు
కూత పెట్టని ఆదిలాబాద్-ఆర్మూర్ రైల్వే లైన్.. ( adilabad Armoor Railway line )
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే సికింద్రాబాద్-నాగ్ పూర్ వయ: (లింగంపల్లి, నాగులపల్లి, సంగారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, నిర్మల్, ఆదిలాబాద్, హింగన్ ఘాట్) రైల్వే లైన్ వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభించడమే కాకుండా, పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుంది, అంతేకాకుండా సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్ నాగపూర్ మధ్య రద్దీ తగ్గించడానికి, రౌండ్ టేబుల్ జర్నీ తగ్గించడానికి, సమయాన్ని మిగిలించడానికి, ఆర్థిక భారాన్ని తొలగించడానికి, సికింద్రాబాద్ నాగపూర్ రైల్వే మార్గంలో సెమీ బుల్లెట్, హై స్పీడ్ రైలు నడపడానికి అవకాశం ఉంటుంది. 2018-19 ఆర్థిక సంవత్సరం రైల్వే బడ్జెట్ లో టోకెన్ అమౌంట్ ఇచ్చి పూర్తిస్థాయిలో సర్వే మరియు భూసార పరీక్ష కాకపోవడం అప్పటి కెసిఆర్ సర్కారు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 33% నిధులు అందించకపోవడం, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వకపోవడం వల్ల ఆగిపోయింది ఇప్పటికైనా త్వరలో సౌత్ సెంట్రల్ రైల్వే తన పరిధిలోని ఏరియాల వారీగా సమావేశం నిర్వహణకు సిద్ధమవుతుంది కావున ఇక్కడ ఉత్తర తెలంగాణపార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, రైల్వే బోర్డు మెంబర్లు ఈ రానున్న వార్షిక బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ బ్లూ బుక్ లో దాదాపు 250 -300 కిలోమీటర్ల నూతన సికింద్రాబాద్-నాగపూర్ రైల్వే లైన్ల పూర్తిస్థాయి నిర్మాణం కోసం బడ్జెట్ తీసుకువస్తారని ఆర్మూర్ నిర్మల్ బోత్ నేరడిగొండ ప్రజలు రైలు కూతను వింటారని ఈ కేంద్ర బడ్జెట్లో పూర్తిస్థాయిలో నిధులకు ఈ ప్రాంతంలో ఉన్న బిజెపి నేతలు కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్తారని ఆశిద్దాం
గాలి మాటల్లో ఎయిర్ పోర్ట్... ( Adilabad Airport )
దశాబ్దాల కాలం నుండి ఆదిలాబాద్ పట్టణానికి గాలి మోటర్లు వస్తాయి అని భారత వైమానిక దళానికి సంబంధించిన 369 ఎకరాల స్థలాన్ని జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంచింది ఈ ఆదిలాబాద్ జిల్లా దేశానికి మధ్య భాగంలో ఉండడం, దాదాపు మూడు నాలుగు మెట్రోపాలిటన్ సిటీ లకు సమాన దూరంలో ఉండడం, పూర్తిగా డ్రై ల్యాండ్ ఉండడం,యుద్ధ వాతావరణంలో భారత వైమానిక దళానికి వ్యూహాత్మక స్థావరంగా ఉండడం ఆదిలాబాద్ భారత వాయిసేనకు కలిసి వచ్చే అంశం. భారత వైవిమానిక దళం, ఎయిర్ ఫోర్స్ శిక్షణ కేంద్రానికి అని, ఎయిర్పోర్ట్ అంటూ కేంద్ర ప్రభుత్వం గడిచిన కొద్ది వారాల కింద రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో బుజు పట్టిన ఫైళ్ళను దులిపి, ఎయిర్పోర్ట్ నిర్మించాలని కోరిన నేపథ్యంలో తాజాగా అంశాన్ని పరిశీలిస్తాం అని తెలిపింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పోర్ట్ ఏర్పాటు చేయాలని దానికి అవసరమైన 1592 ఎకరాల ప్రభుత్వ ప్రైవేటు అసైన్డ్ భూములను గుర్తించి సేకరించే పనిలో ఉంది దీనితోపాటు భారత వైమానిక దళానికి సంబంధించిన 369 ఎకరాలతో మొత్తంగా 1961ఎకరాల స్థలం అందుబాటులో ఉందని దీనిని భారత వైమానిక దళానికి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి రిపోర్టు చేరిందని అధికారిక వర్గాల సమాచారం ఇప్పటికైనా పూర్తిస్థాయి సర్వే చేసి భూములు కోల్పోతున్న ప్రజలకి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పునరావాసం ఏర్పాటు చేస్తూ, వస్తున్న ఎయిర్పోర్ట్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా, ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు గాలి మాటలు కాకుండా కేంద్ర ప్రభుత్వం మెండుగా నిధులు ఇవ్వాలని ఆ వైపుగా ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు రాజకీయాలకతీతంగా ఏకం అవ్వాలని ఒత్తిడి ప్రజల నుంచి ప్రారంభమైందని చెప్పవచ్చు.
కదలని కారిడార్..
నేషనల్ ఇండస్ట్రియల్ కార్డా డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా హైదరాబాద్-నాగ్ పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడం, కేంద్రం పరిశీలిద్దాం అనడం చూశాం కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గడిచిన 10 నెలల్లో కేంద్ర పరిశ్రమలు-వాణిజ్య శాఖల మంత్రిని నాలుగు నుండి ఐదు సార్లు కలిసి కోరడం, ఒత్తిడి పెంచి అనుమతుల ప్రక్రియను తుది దశకు తీసుకురావడం ఒకింత సంతోషమే కానీ నిధుల విడుదల విషయంలో గుజరాత్ లాగా ఎటువంటి మెలికలు పెట్టకుండా నిధులు ఇవ్వాలన్నదే ఈ ప్రాంత వాసుల ఉద్దేశం హైదరాబాద్ నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ వల్ల ఈ ప్రాంతంలో పరిశ్రమల అభివృద్ధి, మౌలికవస్తుల కల్పన, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా మోడరన్ రోడ్లు, రైల్వే లైన్లు, వాయు మార్గాలు అభివృద్ధి చెందుతాయి దీనివల్ల ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరగడమే కాకుండా, ఆర్థిక పరిపుష్టి కి ఈ ప్రాంతం చేరుకుంటుంది ఇప్పటికే వ్యవసాయ పారిశ్రామిక వాణిజ్య సేవల రంగంలో ఎగుమతులు దిగుమతులు పెరగడం వల్ల ఈ జిల్లాలు మరింత ముందుకు వెళ్తాయి, దీనివల్ల సేవల రంగం కూడా విస్తరించే అవకాశం ఉంది దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ పాలసీ ద్వారా మ్యాచింగ్ గ్రాంట్లు, ప్రోత్సాహకాలు, ప్రత్యేక నిధుల విడుదల చేస్తే వేలకోట్ల రూపాయలు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెట్టుబడులు వస్తాయి, దానివల్ల జిల్లా మౌలిక స్వరూపం మారడమే కాకుండా మూతపడ్డ సీసీఐ లాంటి సంస్థలు తెరుచుకునే అవకాశం, సిరామిక్స్, మ్యాంగనీస్, సున్నపురాయి, బొగ్గు లాంటి ఖనిజ వనరుల ఉత్పత్తి పెరగడం దానిద్వారా ఇక్కడి ప్రజానీకానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడం ఆర్థిక సంపూర్ణ స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి కావలసిన నీటి వనరులు అందించే అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి పథకానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి, మహారాష్ట్ర ముంపు సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగితే, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నీటి వనరులను సమృద్ధిగా ఉపయోగించుకోవటానికి నీటి వనరులను నిల్వ చేయడానికి అటవీ ప్రాంతాల్లో చెరువుల నిర్మాణానికి అనుమతులు వస్తే ఇంకా ఈ ప్రాంత రైతాంగం పురోగమివైపు ప్రయాణించి అప్పుల ఉబి నుండిబయటకు వచ్చే అవకాశం ఉంది. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు అపారమైన ఖనిజ సంపద, నీటి వనరులు ఉన్న కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు ఆది నుంచి ఆకలి కేకలే ఉంటున్నాయి. తాజాగా 2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి ఆదిలాబాద్ 10 నియోజకవర్గాలలో నాలుగు నియోజకవర్గాల్లో ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, సిర్పూర్ బిజెపి విజయం సాధించి, బోథ్, ఖానాపూర్ నియోజకవర్గంలో రెండవ స్థానంలో ఉండింది, ఈ గెలుపు వల్ల అసెంబ్లీలో బిజెపీ శాసనసభాపక్ష నేతగా నిర్మల్ ఎమ్మెల్యే, బిజెపిఉప శాసన సభాపక్షనేతగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఉండడం వల్ల పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీ ఇచ్చిన ఈ ప్రాంత ప్రజలు బిజెపిని ఆశీర్వదించడంతో దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో బిజెపి పార్లమెంట్ సభ్యుడు గెలవడం , గెలిచిన పార్లమెంట్ సభ్యుడు వివిధ స్థాయి సంఘాల్లో సభ్యుడిగా ఉండటం సీనియర్ రాజకీయ నాయకుడిగా పేరు ఉండటం ఈ జిల్లా అభివృద్ధికి కలిసి వచ్చే అంశాలే అయినప్పటికీని!? మన ప్రధానమంత్రి మోడీ, కేంద్ర మంత్రులను ప్రత్యక్షంగా కలిసి ఆదిలాబాద్ జిల్లాకు న్యాయంగా రావలసిన యూనివర్సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్, రైల్వే లైన్ తో పాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని, షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల జనాభా ఎక్కువగా ఉన్నది కావున ఆ ప్రజల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంప్రత్యేక నిధులు తీసుకురావాలని, అక్షర క్రమంలోనే కాక వర్ష సంఖ్యలో కూడా 01 ఈ పార్లమెంట్ స్థానాన్ని అభివృద్ధి సూచికలో కూడా మొదటి స్థానంలోకి తీసుకువెళ్తారని, ప్రజలను మభ్యపెట్టకుండా ప్రజా తీర్పును స్వాగతించి భారతీయ జనతా పార్టీని గెలిపించిన ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిద్దాం!! రేపటినుండి కేంద్ర ప్రభుత్వ నిధుల వేటలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించకుండా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరఫున ఈ చిన్ని ఆకాంక్ష..
వ్యాసకర్త: పసుల చంటి, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి , 9866330701