Chhatrapati Shivaji Jayanti 2025: ఛత్రపతి శివాజీ మహారాజ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలివే..
By
Vaasthava Nestham
Chhatrapati Shivaji Jayanti 2025 - భరత జాతి ముద్దుబిడ్డ.. వీరత్వం, ధైర్యం పరాక్రమానికి ప్రతీకగా భావించే ఛత్రపతి శివాజీ మహారాజా జయంతి ఈరోజే. ఈ సందర్భంగా శివాజీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...
Chhatrapati Shivaji Jayanti 2025: భారతదేశ చరిత్రలో గొప్ప యోధులు, సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆయన పేరు ఉంటే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది. చిన్నతనంలోనే మొఘలుల దాడులలో హిందూ మతం అంతరించి పోతుందని, వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ శివాజీ మహారాజు మండే నిప్పు కణికలా దూసుకొచ్చాడు. మొగల్ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడాడు.
అందుకే హిందూమతాన్ని కాపాడిన ఘనత ఒక్క మరాఠా మహారాజు శివాజీకే దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఆ యోధుడి జన్మదినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ఒక వేడుకలా జరుపుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఒక పండుగలా నిర్వహిస్తారు. చరిత్రను పరిశీలిస్తే, 1674లో శివాజీకి చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగింది. అంతటి గొప్ప వీరయోధుడి 394వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన పుట్టినప్పటి నుంచి వీర మరణం పొందే వరకు ఎలాంటి విజయాలు సాధించారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
శివాజీ జననం..
క్రీస్తు శకం 1630లో ఫిబ్రవరి 19వ తేదీన మహారాష్ట్ర పూణే జిల్లాలో ఉన్న జనార్‌లోని శివనీర్ కోటలో జిజియాబాయ్, షహాజీ దంపతులకు శివాజీ జన్మించారు. ఆయన తల్లి క్షత్రియ వంశీయురాలు. శివాజీ పుట్టకముందే పుట్టిన వారంతా చనిపోవడంతో, ఆమె శివపార్వతులను పూజించగా శివాజీ క్షేమంగా ఉన్నాడు. దీంతో ఆయనకు శివాజీ అనే పేరు పెట్టారు.
తల్లిదండ్రుల నుంచి..
శివాజీ మహారాజ్ కన్న తల్లి దగ్గరే పరమత సహనం, మహిళల పట్ల గౌరవంగా ఉండటం నేర్చుకున్నాడు. అతి చిన్న వయసులోనే తను పుట్టిన భూమికి మేలు చేయాలని, ప్రజలతో ఎలా నడుచుకోవాలో శివాజీకి జిజియబాయి పూస గుచ్చినట్టు వివరించారు. మరోవైపు తన తండ్రి పూణేలో జాగీరుగా ఉండేవారు. తన తండ్రి దగ్గర నుంచి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. రాజనీతి మెళకువలు నేర్చుకుంటూ.. తన తండ్రి ఓటముల గురించి అధ్యయనం చేసేవాడు. అప్పుడే సరికొత్త యుద్ధ తంత్రాలను నేర్చుకున్నాడు.
కత్తి పట్టిన తొలిరోజుల్లోనే..
శివాజీ 17వ ఏటలోనే కత్తి పట్టాడు. అంతేకాదు వెయ్యి మంది సైన్యంతో వెళ్లి బీజాపూర్‌కు చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత మూడేళ్లలోపే రాజ్‌ఘడ్, కొండన ప్రాంతాలను ఛేజిక్కుంచుకుని పూణే ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.
గెరిల్లా యుద్ధ రూపకర్త..
‘‘ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి.. అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి’’ ఈ సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవారట. ఇదే శివాజీ పాటించే యుద్ధ తంత్రం. దీన్నే గెరిల్లా యుద్ధం అంటారు.
అన్ని మతాలను సమానంగా..
శివాజీ మహారాజు ముస్లిముల దురాక్రమణను వ్యతిరేకించినప్పటికీ, తన రాజ్యంలో లౌకికవాదాన్ని పాటించారు. అన్ని మతాల వారినీ సమానంగా ఆదరించారు. ఇతర మతాల వారిని కూడా గౌరవించారు. అంతేకాదు హిందువుగా మారిన ఓ వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి వివాహం కూడా జరిపించారట.
శివాజీ సైన్యంలో..
ఛత్రపతి శివాజీ స్నేహితుల్లో చాలా మంది మహమ్మదీయులు ఉన్నారు. తన సైనిక వ్యవస్థలో కూడా ఎందరో ముస్లింలకు సముచిత స్థానం కల్పించారు.
ఆధునిక యుద్ధ తంత్రాలు..
శివాజీ యుద్ధ తంత్రాలు శత్రువులకు అస్సలు అంతుబట్టని విధంగా ఉండేవట. తిరుగులేని యుద్ధ వ్యూహాలను అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకు నిదర్శనం. పటిష్టమైన సైన్యంతో పాటు నిఘా వ్యవస్థను కూడా కలిగి ఉండటమే కాకుండా, ఆధునిక యుద్ధ తంత్రాలను ఉపయోగించాడట. Chhatrapati Shivaji Jayanti
బలమైన నావికా దళం..
శివాజీ మహారాజ్ పటిష్టమైన నావికా దళం మరాఠాలకు మరింత బలాన్ని పెంచింది. ఇందుకు శివాజీ వేసిన బలమైన పునాదులే కారణం. విదేశీ దండయాత్రల నుంచి కాపాడటానికి అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆ కాలంలో ఏ రాజులకు ఇలాంటి ఆలోచనలు రాకపోవడం గమనార్హం.
అఫ్జల్ ఖాన్‌తో సమావేశం..
యుద్ధంలో భయంకరమైన అఫ్జల్‌ఖాన్ ముందుగానే శివాజీ యుద్ధ తంత్రాలను, గెరిల్లా యుద్ధం గురించి తెలుసుకుని.. శివాజీని రెచ్చగొట్టేందుకు, తనకు ఎంతో ఇష్టమైన దుర్గా మాత దేవాలయాన్ని కూలగొట్టాడట. అదే సమయంలో శివాజీ కుట్రలను పసిగట్టి తనను సమావేశానికి ఆహ్వానిస్తాడు. Chhatrapati Shivaji Jayanti 2025
మరాఠా యోధుడిగా..
అదే సమయంలో శివాజీ మహారాజ్ ముందుగానే తన ఉక్కు కవచాన్ని వేసుకుని, చేతికి పులి గోర్లు ధరించి అక్కడికి వెళ్తాడు. అందులో శివాజీ, అప్జల్ ఖాన్ కేవలం అంగరక్షకులతో మాత్రమే హాలులోకి వెళ్తారు. అక్కడ అప్జల్‌ఖాన్ శివాజీని కత్తితో పొడించేందుకు ప్రయత్నించగా.. తన పులి గోర్లతో శివాజీ అఫ్జల్ ఖాన్‌ను ఖతం చేస్తాడు. అందుకే ఆయనను మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ మహారాజుగా పిలుస్తారు.
Comments