Forest deputy Range Officer : టైగర్ జోన్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అజ్మీరా నరేశ్ సస్పెండ్
By
Vaasthava Nestham
• సీజ్ చేసిన వాహనంలో అక్రమంగా వెదురు బొంగు కర్రలు తరలింపు
• సీసీఎఫ్ సమగ్ర విచారణ ఆపై సస్పెండ్
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ డెస్క్ : అటవీ అధికారులు సీజ్ చేసిన వాహనంలో అక్రమంగా వెదురు (కనక) బొంగులు తరలిస్తున్న కవ్వాల్ టైగర్ జోన్ సిరిచెల్మ డిప్యూటీ అటవీ అధికారి అజ్మీరా నరేశ్ సస్పెండ్ ఆయన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. సిరిచెల్మ కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న గీరయ్య రెండు నెలల క్రితం సస్పెండ్ కావడంతో అతని స్థానంలో ఇంద్రవెల్లి కవ్వాల్ టైగర్ జోన్ డిప్యూటీ రేంజ్ అధికారి విధులు నిర్వహిస్తున్న అజ్మీరా నరేశ్ కు సిరిచెల్మ జోన్ గా అదనపు బాధ్యతలు ఇచ్చారు.
మార్చి 21 న ఏమీ జరిగిందంటే...
ఇంద్రవెల్లి అటవీ అధికారులు గత ఏడాది క్రితం అక్రమంగా కలపను రవాణా చేస్తున్న టీఎస్ 30 టీ 1970 నంబర్ గల బొలెరో వాహనంను పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ వాహనాన్ని సీజ్ చేసి, టైగర్ జోన్ రేంజ్ కార్యాలయంకు తరలించారు. సీజ్ చేసిన బొలెరో వాహనంలో సదరు అధికారి గత నెల 21 న అక్రమంగా వెదురు బొంగులను రవాణా చేస్తున్న నేపథ్యంలో అదే రోజు రాత్రి సమయంలో ఉట్నూర్ రెంజ్ పరిధిలో ఉన్న కొత్తగూడ చెక్ పొస్ట్ వద్ద డ్యూటీ అక్కడి డిప్యూటీ రేంజ్ అధికారిని ప్రియాంక, సిబ్బందితో కలిసి ఆ వాహనం తనిఖీ చేసారు. తనిఖీ చేస్తున్నప్పుడు వాహనంలో ఇద్దరు ఫారెస్ట్ బీట్ అధికారులు, వాచ్ మెన్లు ఉన్నారు. సీజ్ చేసిన వాహనాన్ని వాడకానికి ఎవరు అనుమతి ఇచ్చారని..? వెదురు బొంగులు అక్రమంగా ఎక్కడికి తరలిస్తున్నట్లు ఆమె ప్రశ్నించారు. డిప్యూటీ రేంజ్ అధికారి అజ్మీరా నరేశ్ ఆదేశాల మేరకు సీజ్ చేసిన వాహనంలో వెదురు బొంగులను తరలిస్తున్నట్లు వారు చెప్పడంతో తనిఖీ చేస్తున్న అధికారులందరూ అవాక్కయ్యారు. దీనిపై బాసర జోన్ నిర్మల్ జిల్లా సీసీఎఫ్ శర్వానంద్ సమగ్ర విచారణ చేపట్టారు. సదరు అధికారి అవినీతికి పాల్ప డుతున్నట్లు రుజువు కావడంతో సస్పెండ్ చేశారు. దీనిపై ఇచ్చోడ కవ్వాల్ టైగర్ జోన్ అధికారి నాగవత్ స్వామిని "వాస్తవ నేస్తం"సంప్రదించగా నేను బిజీలో ఉన్నాను. తరువాత ఫోన్ చేస్తానంటూ కాల్ కట్ చేయడం గమనార్హం. సస్పెండ్ అయిన సదరు అధికారి సమాచారాన్ని ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Comments