వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: అంతర్జాతీయ మార్కెట్లలో గత 12 ఏళ్లలోలేని విధంగా పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 6.3 శాతం పతనంకాగా.. వెండి మరింత అధికంగా 2021 తదుపరి 8.7 శాతం పడిపోయింది. వెరసి యూఎస్ కామెక్స్‌లో ఔన్స్ పసిడి ధర 4,082 డాలర్లకు చేరగా.. వెండి ఔన్స్ 47.89 డాలర్లను తాకింది. దీంతో దేశీయంగా బంగారం 10 గ్రాములు కనీసం రూ. 6,000 తగ్గవలసి ఉన్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా ఇటీవల బంగారం 10 గ్రాములు రూ. 1,34,800ను తాకగా.. వెండి రూ. 1,85,000కు చేరిన విషయం విదితమే. అయితే డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, దిగుమతి సుంకం మదింపు తదుపరి ధరలు నిర్ణయమయ్యే సంగతి తెలిసిందే. ఈ బాటలో పలాడియం, ప్లాటినం ధరలు సైతం అంతర్జాతీయ మార్కెట్లో 7 శాతం చొప్పున పతనం కావడం గమనార్హం! కాగా.. 2025 డిసెంబర్ ఫ్యూచర్స్ పసిడి రాత్రి 10.30 ప్రాంతంలో 5.5 శాతం (237 డాలర్లు) క్షీణించి 4,122 డాలర్ల వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో గరిష్టంగా 4,393 డాలర్లకు చేరగా.. 4,095 డాలర్ల వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ 7.36 శాతం పడిపోయి 47.60 డాలర్ల వద్ద కదులుతోంది. ఒక దశలో 51.61 డాలర్ల వద్ద గరిష్టాన్ని, 47.14 డాలర్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

