వాస్తవనేస్తం,వెబ్‌డెస్క్: మణుగూరు పట్టణంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ కార్యాలయంలోకి చొరబడి, ఫర్నీచర్ ధ్వంసం చేసి, ఆపై పెట్రోల్ పోసి మంటలు పెట్టారు. అనంతరం అక్కడ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కూడా దాడికి దిగినట్లు సమాచారం. ఈ ఘటనతో మణుగూరులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడగా, పోలీసులు తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
కాంగ్రెస్ నాయకులు మాత్రం, ప్రభుత్వ భూమిని అక్రమంగా పార్టీ కార్యాలయంగా వాడుతున్నారని ఆరోపించారు. ఈ కారణంగానే స్థానికుల ఆగ్రహం వ్యక్తమైందని వారు పేర్కొన్నారు. దాడి ఘటనపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. తమ పార్టీ కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యగా ఖండించింది. “ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేధాలు సహజమే కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో హింసా రాజకీయాలు మళ్లీ పుంజుకుంటున్నాయి” అని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ దాడిలో కొంతమంది గాయపడినట్లు తెలుస్తోంది. పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు

