భయంకర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ నారాయణఖేడ్ మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు
దుర్మరణం పాలయ్యారు.బుధవారం తెల్లవారుజామున హల్లిఖేడ్ వద్ద వాహనం నియంత్రణ కోల్పోయి వ్యాన్, కారు ఢీకొన్న
ఘటనలో ఈ విషాదం చోటుచేసుకుంది.
మరణించిన వారిని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని జగన్నాథ్‌పూర్
గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
మృతులను నవీన్ (40), రాచప్ప (45), నాగరాజు (40), కాశీనాథ్ (60)లుగా గుర్తించారు.
వీరంతా గణపూర్ దత్తాత్రేయ ఆలయ దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్నారని సమాచారం.
ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని
సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ప్రమాదానికి వాహన వేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? అన్నదానిపై విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటనతో జగన్నాథ్‌పూర్ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

