• 50 వేల లంచం డిమాండ్..
• 40 వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: జిల్లాలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది. ఓ కేసు వ్యవహారంలో బాధితుడి నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటూ బజార్హత్నూర్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రమేష్ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు.
బజార్హత్నూర్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రమేష్.. ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. అంత మొత్తం తాను ఇచ్చుకోలేనని బాధితుడు ఎంతగానో బతిమాలాడు. దీంతో స్పందించిన ఎస్సై, ఆ మొత్తాన్ని చివరికి రూ.40 వేలకు కుదించి బేరసారాలు కుదుర్చుకున్నారు.
ఎస్సై వేధింపులు భరించలేకపోయిన బాధితుడు నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించి లిఖితపూర్వక ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో వెంటనే అప్రమత్తమైన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక రచించారు. ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో సిబ్బంది వ్యూహాత్మకంగా వలపన్నారు. పథకం ప్రకారం.. బాధితుడి నుంచి ఎస్ఐ రమేష్ రూ.40 వేల నగదు లంచం తీసుకుంటున్న తరుణంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు, ఎస్ఐ రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బజార్హత్నూర్ పోలీస్‌స్టేషన్‌లో విస్తృతంగా సోదాలు నిర్వహించి, కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో వెంటనే చేరండి!