• ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 25 బృందాలతో ఆకస్మిక తనిఖీలు
• 13 మండలాల్లో దాడులు.. 18 మందిపై కేసులు నమోదు
• పెద్ద ఎత్తున ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లు, ఖాళీ చెక్కులు స్వాధీనం
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : సామాన్యులు, రైతులు మరియు అమాయక ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలతో, అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తున్న వ్యాపారులపై ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో 25 ప్రత్యేక పోలీసు బృందాలు ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించి లైసెన్సులు లేకుండా చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ ప్రజలను వేధిస్తున్న 18 మందిపై జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.
ఈ దాడులు ఆదిలాబాద్ వన్ టౌన్, టు టౌన్, మావల, రూరల్, బోథ్, బేల, ఉట్నూర్, ఇచ్చోడా, నార్నూర్, గుడిహత్నూర్, నేరడిగొండ, జైనథ్ మండల పరిధుల్లో ఏకకాలంలో కొనసాగాయి. తనిఖీల సమయంలో వడ్డీ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల నుంచి భారీగా ప్రామిసరీ నోట్లు, బాధితుల నుంచి బలవంతంగా తీసుకున్న సంతకాలతో కూడిన ఖాళీ బ్యాంక్ చెక్కులు, ఖాతా రిజిస్టర్లు, ఇళ్లు మరియు స్థలాలకు సంబంధించిన ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడిన వారందరిపై మనీ లెండర్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

మండలాల వారీగా నిందితుల వివరాలు పరిశీలిస్తే, ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్.కే. సాజిద్ అలియాస్ సాజిత్ గౌడ్, బంగారు షాపు యజమాని ఎర్రోజు కేశవ్, కొలిపురకు చెందిన ఓరగంటి రఘు అనే ముగ్గురిపై కేసులు నమోదు కాగా, ఆదిలాబాద్ టు టౌన్ పరిధిలో టాపిక్ అహ్మద్ అలియాస్ జన్ను, షేక్ అక్బర్ అనే ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. మావల మండల పరిధిలో దుర్గా శేఖర్ రెడ్డి, దాసరి నరోత్తం, చిట్టి రాజేశ్వర్, షేక్ ఆసిఫ్ అనే నలుగురిపై కేసులు నమోదు కాగా, ఆదిలాబాద్ రూరల్ మండల పరిధిలోని రాంపూర్‌కు చెందిన అజయ్ కుమార్ గాడ్సేపై కేసు నమోదు చేశారు.
అలాగే జైనథ్ మండల పరిధిలో ఆత్మకూరు అమరేందర్, బేల మండల పరిధిలో కార్తీక్, బోథ్ మండల సాయి నగర్‌కు చెందిన ఈ. రమేష్‌పై కేసులు నమోదయ్యాయి. ఉట్నూర్ మండల పరిధిలో దంతనపల్లికి చెందిన సాయి రెడ్డి, ఇప్ప సంతోష్ అనే ఇద్దరిపై కేసులు నమోదు కాగా, నేరడిగొండ మండలం వడూర్‌కు చెందిన కలాలి వెంకటరమణ, నార్నూర్ మండల పరిధిలో అరే అశ్విని, గుడిహత్నూర్ మండలం మన్నూర్‌కు చెందిన కేంద్రీ రాహుల్‌పై పోలీసులు కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మాట్లాడుతూ జిల్లాలో ఆసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపడమే పోలీసు యంత్రాంగం ప్రధాన లక్ష్యమని తేల్చిచెప్పారు. అనుమతులు లేకుండా వ్యాపారాలు చేస్తూ అధిక వడ్డీల పేరుతో అమాయక ప్రజల నడ్డి విరిచే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు ఇలాంటి ఆకస్మిక తనిఖీలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!