vaasthavanestham.com
Date of Publish : 09 October 2026, 10:48 pm Posted by : VAASTHAVA NESTHAM MEDIA

వార్తల ప్రచురణకు ముందు వాస్తవ నిర్ధారణ తప్పనిసరి : ఎస్పీ అఖిల్ మహాజన్

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : మీడియా ప్రతినిధులు వార్తలను ప్రచురించే ముందు వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించి, నిజ నిర్ధారణ చేసిన తర్వాతే ప్రజలకు అందించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శుక్రవారం స్థానిక టీటీడీసీ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తప్పుడు సమాచారం, ఫేక్ న్యూస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఎస్పీ హెచ్చరించారు. సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా జర్నలిస్టులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ) పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని స్పష్టం చేశారు. ఏఐ ద్వారా సృష్టించిన లేదా మార్పులు చేసిన ఫొటోలు, వీడియోలను సరిచూసుకోకుండా ప్రచురించవద్దని, ధ్రువీకరించని సమాచారం వల్ల ప్రజల్లో అపోహలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.

సమాజ హితమే మీడియా లక్ష్యం కావాలి : 

ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభంగా కీలక పాత్ర పోషిస్తోందని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు సమాజానికి ఉపయోగపడే సమాచారాన్ని అందించాలని పిలుపునిచ్చారు. వార్తల విశ్వసనీయతను కాపాడుతూ బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని కొనసాగించాలని కోరారు. అనంతరం, రెండు రోజుల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న మీడియా ప్రతినిధులకు ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వేంకటేశ్వరరావు, జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్‌వో) విష్ణు వర్ధన్, మీడియా అసోసియేషన్ ప్రతినిధులు రాజేశ్వర్, దేవేందర్, వినోద్, సురేష్, వెంకట్, కిరణ్‌లతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్