vaasthavanestham.com
Date of Publish : 18 September 2026, 9:23 am Posted by : VAASTHAVA NESTHAM MEDIA

ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ‘బహుజన విద్యార్థి మూమెంట్’ ఆవిర్భావం

• బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ప్రధాన ధ్యేయం

• ఫీజు రీయింబర్స్‌మెంట్, నాణ్యమైన విద్య కోసం పోరాటం

• ఏడుగురు సభ్యులతో రాష్ట్ర కమిటీ ఏర్పాటు

 

వాస్తవ నేస్తం,ఓయూ క్యాంపస్: బడుగు, బలహీన, సబ్బండ వర్గాల విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ‘బహుజన విద్యార్థి మూమెంట్’ పేరుతో నూతన విద్యార్థి సంఘం ఆవిర్భవించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలో ఒక నూతన ఒరవడిని సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వ అధికారిక రిజిస్ట్రేషన్‌తో ఏడుగురు సభ్యులతో కూడిన నూతన కమిటీని చట్టబద్ధంగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్‌ల సాధన, నాణ్యమైన వసతి గృహాల కల్పనకు తమ ఆర్గనైజేషన్ నిరంతరం కృషి చేస్తుందని సంఘం నాయకులు స్పష్టం చేశారు. వ్యవస్థలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో సామాన్యుడికి ప్రాధాన్యం దక్కేలా పోరాడతామన్నారు. అలాగే సమాజంలో అసమానతలు, అంటరానితనం, మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి చేస్తూ, శాస్త్రీయ దృక్పథంతో అందరికీ సమాన గౌరవం, అవకాశాలు దక్కేలా నవయుగ సమాజ నిర్మాణానికి అడుగులు వేస్తామని ప్రకటించారు.

బహుజన విద్యార్థి మూమెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా బాన్సువాడ వేదాంత్ మౌర్య, ఉపాధ్యక్షురాలిగా దుబ్బాక శివకళ్యాణి, ప్రధాన కార్యదర్శిగా మద్దెల సందీప్, జాయింట్ సెక్రటరీగా మహమ్మద్ లతీఫ్, ట్రెజరర్‌గా నేనావత్ ప్రవీణ్, కార్యవర్గ సభ్యులుగా దుర్గాప్రసాద్, నవీన్ ఎన్నికయ్యారు. అలాగే సంఘం లీగల్ అడ్వైజర్‌గా పానుగంటి ప్రవీణ్ వ్యవహరించనున్నారు.

బాధితులు, విద్యార్థుల పక్షాన నిలబడతాం: బాన్సువాడ వేదాంత్ మౌర్య

 

ఈ ఆవిర్భావ సమావేశంలో సంఘం అధ్యక్షుడు బాన్సువాడ వేదాంత్ మౌర్య మాట్లాడుతూ.. రాగద్వేషాలకు అతీతంగా ప్రతి ఒక్కరి సిద్ధాంతాలను గౌరవిస్తూ ముందుకు సాగుతామన్నారు. మహనీయుల ఆలోచనలు, మేధావుల జ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజలు, విద్యార్థులు, బాధితుల పక్షాన నిలబడి నిజాన్ని నిర్భయంగా కాపాడుతామన్నారు. సమసమాజ స్థాపన కోసం భావసారూప్యత కలిగిన ఇతర విద్యార్థి సంఘాలు, ప్రజల బాగు కోరే రాజకీయ పార్టీలు, నికార్సైన ప్రజా నాయకులతో కలిసి పనిచేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన విద్యార్థి మూమెంట్ రాష్ట్ర కమిటీ సభ్యులు సందీప్, అంజన్ కుమార్, నవీన్, శ్రీశైలం, లోకేష్, రమేష్ లతో పాటు పలువురు రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్