వాస్తవ నేస్తం,హైదరాబాద్: భాగ్యనగరంలో ఎంతో విశిష్టత కలిగిన బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం పాట ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ఏడాది 21 కిలోల బాలాపూర్ గణేశుడి మహా ప్రసాదాన్ని (లడ్డూ) అర్బన్ గ్రూప్‌కు చెందిన సామా ప్రణీత్ రెడ్డి రూ. 39 లక్షల రికార్డు ధరకు సొంతం చేసుకున్నారు. గతేడాది ఈ లడ్డూ ధర రూ.35 లక్షలు పలకగా, ఈసారి ఏకంగా మరో రూ.4 లక్షలు అదనంగా పలకడం విశేషం.
ఈ ప్రతిష్టాత్మక వేలం పాటలో ఈ ఏడాది మొత్తం 9 మంది పోటీ పడగా, అందులో ఐదు కార్పొరేట్ సంస్థలు ఉండటం గమనార్హం. కేవలం ఈ లడ్డూ వేలంలో పాల్గొనేందుకు ఎన్‌ఆర్‌ఐలు సైతం విదేశాల నుంచి బాలాపూర్‌కు తరలివచ్చారు. విజేత ప్రణీత్ రెడ్డితో పాటు ఈ వేలంలో మర్రి రవికిరణ్ రెడ్డి (చంపాపేట్), కందాడ శాలిని వీరేందర్ రెడ్డి (కేవీఏ ఫ్లవర్ మర్చంట్, చంపాపేట్), కంచర్ల శివ రెడ్డి (హస్తినాపురం), సామ దయానంద్ రెడ్డి & సామ వరణంద్ రెడ్డి (ది సుషీ కో, లండన్), గడ్డం నవీన్ రెడ్డి (జీఎన్ఆర్ డెవలపర్స్, హస్తినాపురం), శ్రీకాంత్ (పీఎస్‌కే గ్రూప్), ఇబ్రాం ప్రత్యూష్ (బాలాపూర్) తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
రూ.450 నుంచి రూ.39 లక్షలకు..
బాలాపూర్ గణేశుని లడ్డూను సొంతం చేసుకుంటే సిరిసంపదలతో పాటు, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 1994లో తొలిసారిగా కేవలం రూ.450తో ప్రారంభమైన ఈ వేలం పాట.. మూడు దశాబ్దాల కాలంలో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ఏకంగా రూ.39 లక్షలకు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది.
లడ్డూ వేలం విజయవంతంగా ముగిసిన అనంతరం బాలాపూర్ గణనాథుని శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. భక్తుల కోలాహలం, డప్పు చప్పుళ్ల మధ్య హుస్సేన్‌సాగర్‌లో మహా నిమజ్జనానికి స్వామివారు పయనమయ్యారు.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!