vaasthavanestham.com
Date of Publish : 04 February 2026, 6:56 pm Posted by : VAASTHAVA NESTHAM MEDIA

Municipal Elections | కుమారుడికి టికెట్ దక్కకపోవడంతో ఆగిన తల్లి గుండె

• పెద్దపల్లి మున్సిపాలిటీ 9వ వార్డులో కలకలం

వాస్తవ నేస్తం,పెద్దపల్లి: పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుమారుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో కలత చెందిన తల్లి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కటికెనపల్లి రవికుమార్ గత కొంతకాలంగా పార్టీలో చురుకుగా వ్యవహరిస్తూ, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. మున్సిపల్ ఎన్నికలు సమీపించడంతో 9వ వార్డు నుంచి పోటీ చేసేందుకు నిర్ణయించుకున్న ఆయనకు మొదట్లో పార్టీ అధిష్టానం నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే, అదే వార్డు నుంచి మరో అభ్యర్థి టికెట్ కోసం ప్రయత్నాలు చేయడంతో పరిణామాలు అనూహ్యంగా మారాయి. సంబంధిత వర్గానికి చెందిన మత పెద్దలు అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావడంతో చివరికి టికెట్‌ను మరో వ్యక్తికి కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో రవికుమార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కుమారుడి నిర్వేదాన్ని గమనించిన ఆయన తల్లి వీరమ్మ ఆ బాధను తట్టుకోలేక అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై ఏర్పడిన అనిశ్చితి కారణంగా తల్లి ప్రాణాలు కోల్పోయిందన్న విషయం వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. విషయం తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో ప్రజలు రవికుమార్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై స్థానిక ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థిని పక్కన పెట్టి, ఒత్తిడులకు లోబడి టికెట్ కేటాయించడంపై వారు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్