vaasthavanestham.com
Date of Publish : 08 October 2026, 9:01 am Posted by : VAASTHAVA NESTHAM MEDIA

పోలీసులమంటూ అక్రమ వసూళ్లు.. ఇద్దరు అరెస్ట్

• పశువుల వాహనాల డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసిన నిందితులు

 వాస్తవ నేస్తం,ఇచ్చోడ: తాము పోలీసులమని పశువులను తరలించే వాహనదారులను బెదిరించి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు కేటుగాళ్లను ఇచ్చోడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అక్టోబర్ 7న నిర్మల్ బైపాస్ రోడ్డు వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఇచ్చోడ సీఐ, ఎస్‌హెచ్‌ఓ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అక్టోబర్ 7 ఉదయం నిర్మల్ బైపాస్ రోడ్డుపై పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను చూడగానే వారు పారిపోయేందుకు యత్నించగా, సిబ్బంది వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్‌కు తరలించి విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పశువుల రవాణా వాహనాలను అడ్డుకుని, తాము పోలీసులమని (Fake Police Extortion k ) చెప్పి డ్రైవర్లను బెదిరించి నగదుతో పాటు ‘ఫోన్ పే’ వంటి ఆన్‌లైన్ పేమెంట్ల ద్వారా కూడా డబ్బులు దండుకుంటున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. బుధవారం కూడా నిర్మల్ బైపాస్ వద్ద పశువుల వాహనాల నుంచి డబ్బులు వసూలు చేయాలనే దురుద్దేశంతోనే అక్కడికి వచ్చినట్లు విచారణలో అంగీకరించారు.అరెస్టయిన నిందితులను మహమ్మద్ జిషాన్ ఖురేషీ అలియాస్ అబ్బు, షేక్ ఇమ్రాన్‌గా గుర్తించినట్లు సీఐ తెలిపారు.

ఈ సందర్భంగా సీఐ ప్రవీణ్ కుమార్ ప్రజలను, వాహనదారులను అప్రమత్తం చేశారు. ఎవరైనా పోలీసులమని చెప్పి బెదిరింపులకు దిగినా, అక్రమంగా డబ్బులు డిమాండ్ చేసినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని అన్నారు. పోలీసు అధికారులమని చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్