vaasthavanestham.com
Date of Publish : 08 February 2026, 1:10 pm Posted by : VAASTHAVA NESTHAM MEDIA

Farmer Registration | రైతుకు డిజిటల్ గుర్తింపు… పథకాలన్నీ ఒకే దారిలోకి: ‘ఫార్మర్ రిజిస్ట్రీ’తో వ్యవసాయ రంగంలో కొత్త అధ్యాయం

దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవ్వాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ (Farmer Registry) వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌లో భాగంగా ప్రారంభమైన ఈ విధానం ద్వారా రైతుల వివరాలన్నీ ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో నమోదు అవుతాయి. కావున ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సంబంధిత శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఫార్మర్ రిజిస్ట్రీ అంటే ఏమిటి.. ఎందుకు ఈ రిజిస్ట్రీ అవసరం..?

ప్రతి రైతుకు కేటాయించే ప్రత్యేక డిజిటల్ గుర్తింపు సంఖ్యనే ఫార్మర్ రిజిస్ట్రీ. రైతు వ్యక్తిగత వివరాలు, ఆధార్, భూమి సమాచారం, సాగు పంటల వివరాలు ఇందులో ఉంటాయి. నమోదు పూర్తయిన తర్వాత రైతుకు 11 అంకెల రైతు ఐడీ లభిస్తుంది. ఇప్పటి వరకు రైతుల సమాచారం విభిన్న శాఖల్లో విడివిడిగా ఉండటంతో పథకాల అమలులో జాప్యం, గందరగోళం ఏర్పడింది. ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా అర్హులైన రైతులకు మాత్రమే పథకాల లబ్ధి నేరుగా ఖాతాల్లోకి చేరేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

పీఎం కిసాన్ సహా ప్రభుత్వ పథకాల సాయం నేరుగా బ్యాంక్ ఖాతాలోకి పంట రుణాలు, బీమా క్లెయిమ్‌లు త్వరగా మంజూరు, ఎరువులు, విత్తనాలు, యంత్రాలపై సబ్సిడీలు సులభంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట విక్రయానికి అడ్డంకులు లేకుండా మధ్యవర్తుల జోక్యం తగ్గి అవినీతి నివారణకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అంటోంది.

రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు : ఆధార్ కార్డు, భూమి పత్రాలు, పట్టాదారు పాస్‌బుక్, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు.

ఎలా నమోదు చేసుకోవాలి : గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO), సమీప మీ-సేవ లేదా CSC కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ ఉంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అవకాశమూ ఉంది. రాబోయే రోజుల్లో రైతులకు అందే అన్ని ప్రభుత్వ సేవలు ఈ రైతు ఐడీ ద్వారానే అమలయ్యే అవకాశముంది. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటల్ దిశగా తీసుకెళ్లే కీలక అడుగుగా ఇది మారనుంది.

ఫార్మర్ రిజిస్ట్రీ అమలు పటిష్టంగా జరిగితే, పథకాల లబ్ధి లీకేజీ తగ్గి నిజమైన రైతుకు న్యాయం జరిగే అవకాశం ఉంది. డిజిటల్ వ్యవస్థపై రైతుల నమ్మకం పెరిగితే, ఇది వ్యవసాయ రంగంలో దీర్ఘకాలిక మార్పులకు బాటలు వేస్తుంది.

 

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్