vaasthavanestham.com
Date of Publish : 02 November 2026, 4:34 pm Posted by : VAASTHAVA NESTHAM MEDIA

CSP centre | సీఎస్‌పీ కేంద్రం ముసుగులో వడ్డీ వ్యాపారం 

• కస్టమర్ సర్వీస్ పాయింట్ కేంద్రాన్ని అడ్డుపెట్టుకుని దందా

• నిందితుడి నుంచి చెక్కులు, పాస్ పుస్తకాలు, నకిలీ రబ్బరు ముద్ర స్వాధీనం

 

వాస్తవ నేస్తం,ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఎలాంటి చట్టబద్ధమైన కస్టమర్ సర్వీస్ పాయింట్ (CSP) ముసుగులో అమాయక ప్రజలకు అక్రమంగా అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఇచ్చోడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఇచ్చోడ ఎస్‌హెచ్‌ఓ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ ఎక్స్ రోడ్ వద్ద ఎస్‌బీఐ బ్యాంకు సమీపంలో జల్దా గ్రామానికి చెందిన అడే కైలాష్ అనే వ్యక్తి కొంతకాలంగా వినియోగదారుల సేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే, ఈ కేంద్రాన్ని అడ్డుపెట్టుకుని స్థానిక ప్రజలకు ఎటువంటి లైసెన్స్ లేకుండా ఇష్టానుసారంగా అధిక వడ్డీకి నగదు అప్పుగా ఇస్తున్నాడు.

అప్పు తీసుకున్న అమాయక ప్రజల వద్ద నుంచి గ్యారెంటీగా ఖాళీ చెక్కులు, బ్యాంకు పాస్ పుస్తకాలు మరియు ఇతర పత్రాలు సేకరించి వారిని వేధింపులకు గురిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా, బ్యాంకు సేవా కేంద్రం ముద్రను దుర్వినియోగం చేస్తూ నకిలీ రబ్బరు ముద్రను కూడా ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

నిందితుడి వద్ద నుంచి ఒక ఖాళీ చెక్కు, ఒక బ్యాంకు పాస్ పుస్తకం, సేవా కేంద్రం ముద్రతో ఉన్న రెండు బ్యాంకు డిపాజిట్ రశీదులు, నాలుగు ఇతర డిపాజిట్ రశీదులు మరియు ఒక నకిలీ రబ్బరు ముద్రను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌ఓ మాట్లాడుతూ.. చట్టబద్ధమైన అనుమతులు లేని అనధికార వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని మోసపోవద్దని ప్రజలను కోరారు. ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తిచేశారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్