వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో తల్వార్ పట్టుకుని తిరుగుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేసిన ఒక యువకుడిని ఇచ్చోడ పోలీసులు (Ichoda police) అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇచ్చోడ మండలం ధాబా-బి గ్రామానికి చెందిన టేకులే గణపతి (23) ఈ నెల 20వ తేదీన జరిగిన దసరా పండుగ ర్యాలీలో చేతిలో కత్తితో సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీసు కానిస్టేబుల్ రామ్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి వెంటనే గ్రామానికి చేరుకున్నారు. సదరు యువకుడు బహిరంగంగా ఆయుధం పట్టుకుని ర్యాలీలో పాల్గొంటున్నట్లు ప్రత్యక్షంగా గమనించి, ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
భయాందోళనలు సృష్టించేలా బహిరంగ ప్రదేశాల్లో ఆయుధాలతో (handling weapons) సంచరించడం చట్టరీత్యా నేరమని ఎస్‌హెచ్‌ఓ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. పండుగ వాతావరణాన్ని దెబ్బతీసేలా ఎవరైనా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఉత్సవాలను ప్రజలంతా ప్రశాంతమైన వాతావరణంలో, చట్ట నిబంధనలకు లోబడి జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజలకు భయాందోళన లేదా ఇబ్బంది కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు పరిసరా ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారని, ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా ఆయుధాలు కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని గ్రామస్తులను కోరారు. పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తున్నామని వివరించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో యువత ఆవేశంలో ఇటువంటి అక్రమ చర్యలకు పాల్పడి తమ భవిష్యత్తును పాడుచేసుకోవద్దని పోలీసులు హితవు పలికారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!