• నిఘా కరువైందని స్థానికుల ఆందోళన..!
• పరీక్షా కేంద్రాల సమీపంలో నకలు చిట్టీల విక్రయాలు
• గతంలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం కారు పై దాడులు
• తక్షణమే విచారణ జరిపి అక్రమాలకు అడ్డుకట్ట వెయ్యకుంటే భవిష్యత్తు ప్రమాదమే..
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : ఇచ్చోడ మండల కేంద్రంలో పరీక్షల సమయంలో మాస్ కాపీయింగ్‌కు ఉపయోగించే మైక్రో జిరాక్స్, నకలు చిట్టీలు అందుబాటులో ఉంటున్నాయన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని కొన్ని జిరాక్స్ సెంటర్లలో విద్యార్థులకు అవసరమైన నకలు చిట్టీలను సిద్ధం చేసి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రతి పరీక్ష సమయంలోనూ ఇదే తంతు నడవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులను అక్రమ మార్గంలో పరీక్షలు రాసేలా ప్రోత్సహిస్తున్నది ఎవరన్న ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. తమ విద్యాసంస్థల ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకునేందుకు కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలే పరోక్షంగా ఇలాంటి వ్యవహారాలకు ఊతమిస్తున్నాయన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. అయితే, ఈ వ్యవహారం వెనుక ఎవరి హస్తం ఉందనేది అధికారుల సమగ్ర విచారణలోనే తేలాల్సి ఉంది.
ఇచ్చోడ మండలంలో గతంలో పరీక్షల తనిఖీలకు వచ్చిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందంపై దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, పరీక్షా కేంద్రాల వద్ద మరింత కట్టుదిట్టమైన భద్రత మరియు నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. నిబంధనల ప్రకారం పరీక్షల సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించాల్సి ఉన్నప్పటికీ, పరీక్షలకు సంబంధించిన మాస్కాపింగ్ మైక్రో జిరాక్స్ చిట్టీలు ఒకరోజు ముందుగానే సమకూరుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కష్టపడి చదివే ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలంటే, సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!