• ఎంబీబీఎస్ సీట్లు సాధించిన ఇచ్చోడ మండల విద్యార్థులు
• స్మార్ట్ వాచ్‌లు బహుకరించి అభినందించిన మదన్ వెంకట్ రావ్ గిత్తే
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి, ఎంబీబీఎస్ సీట్లు సాధించిన ఇచ్చోడ మండలానికి చెందిన విద్యార్థులను ఆదివారం ఘనంగా సన్మానించారు. మండల కేంద్రానికి చెందిన సృష్టి మారుతీ ముండే, చించోలి గ్రామానికి చెందిన సృష్టి రాంచందర్ కేంద్రే తో పాటు సేజల్ సంజీవ్ గిత్తే వైద్య విద్యకు ఎంపికైన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా జల్దా గ్రామానికి చెందిన సామాజిక సేవకుడు, ‘జై దేవి మెడికల్’ అధినేత మదన్ వెంకట్ రావ్ గిత్తే విద్యార్థులను ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత చదువులు అభ్యసించి ఉత్తమ వైద్యులుగా ఎదగాలని ఆకాంక్షించారు. తద్వారా తమ గ్రామాలకు, అలాగే సంఘానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు. అనంతరం విద్యార్థులకు ప్రోత్సాహకంగా తన వంతుగా స్మార్ట్ వాచ్‌లను బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వంజారి సంఘం పెద్దలు, ప్రముఖులు సుధామ్ గిత్తే, రాంచందర్ తిడ్కే, భానుదాస్ గిత్తే, డాక్టర్ బాలకృష్ణ, మౌళి, సురేష్, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు సాధించిన విజయం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!