vaasthavanestham.com
Date of Publish : 09 October 2026, 12:39 pm Posted by : VAASTHAVA NESTHAM MEDIA

Zp High School : విద్యార్థుల మధ్య గొడవ : ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపమే కారణమా?

 • రోడ్డుపై కొట్టుకుంటున్నా విద్యార్థులు..

• పాఠాలు సరే.. క్రమశిక్షణ ఏది.? విద్యార్థుల తల్లిదండ్రుల అసహనం. 

 

వాస్తవ నేస్తం,ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ కు గతంలో మంచి పేరు ఉండేది. ఈ పాఠశాలలో చదువుకున్న ఎందరో విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. కానీ ఇటీవల కొన్ని సంఘటనలు చూస్తూ ఆ పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్‌ఎస్) లో విద్యార్థులు రహదారిపై బహిరంగంగా కొట్టుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే, పాఠశాలలో ఇంతటి అరాచక వాతావరణం నెలకొంటున్నా ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపించడమే ఇందుకు ప్రధాన కారణమని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలోనే అత్యధిక విద్యార్థుల సంఖ్య కలిగిన పాఠశాలగా పేరుపొందిన ఈ స్కూల్‌లో విద్యార్థుల మధ్య క్రమశిక్షణ మృగ్యమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తరగతి గదుల్లో, పాఠశాల ఆవరణలో ప్రారంభమయ్యే వివాదాలు రచ్చకెక్కి విద్యార్థులు రోడ్డుపై కొట్టుకునే వరకు ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ పలుమార్లు ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ, ఉపాధ్యాయులు సరిగా స్పందించకపోవడం, కనీస కౌన్సెలింగ్ ఇచ్చి మందలించకపోవడం వల్లనే విద్యార్థులు బరితెగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

పాఠశాల వేళల్లో విద్యార్థుల ప్రవర్తనను సరిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంటుంది. కేవలం బోధనకే పరిమితమై, విద్యార్థుల క్రమశిక్షణను గాలికి వదిలేస్తే ఎలా అని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. విద్యార్థులు పాఠశాల ప్రాంగణం దాటి బయటకు వెళ్లి కొట్టుకుంటున్నా ఉపాధ్యాయులు గమనించకపోవడం వారి పనితీరులోని అలసత్వానికి అద్దం పడుతోందని విమర్శిస్తున్నారు.

ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, విధి నిర్వహణలో విఫలమవుతున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని, పాఠశాలలో భద్రత మరియు క్రమశిక్షణను పునరుద్ధరించాలని గ్రామస్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్