vaasthavanestham.com
Date of Publish : 17 September 2026, 12:04 pm Posted by : VAASTHAVA NESTHAM MEDIA

ముల్తానీ కమ్యూనిటీ సమస్యల అధ్యయనానికి ప్రత్యేక కమిటీ

• జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల

• ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : ఇచ్చోడ మండలంలో నివసిస్తున్న ముల్తానీ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, ఉపాధి సమస్యలను పరిష్కరించే దిశగా జిల్లా యంత్రాంగం కీలక అడుగు వేసింది. వారి పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, తగిన పరిష్కార మార్గాలు చూపేందుకు ముగ్గురు అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు.
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్ కౌన్సిలర్ ప్రతినిధి ఎస్.ఎస్. రషీద్ ఉల్ హక్, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు సద్దాం తదితరులు ఇటీవల కలెక్టర్‌ను కలిసి ముల్తానీ సామాజిక వర్గం పడుతున్న ఇబ్బందులను వివరించారు. వారి జీవనోపాధి, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వ పరంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఈ మేరకు అధికారులతో కూడిన పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ ప్రత్యేక కమిటీకి ఇచ్చోడ తహసీల్దార్ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, ఇచ్చోడ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) సభ్యుడిగా, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి (డీఎంబ్ల్యూఓ) మెంబర్-కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రధానంగా ముల్తానీ కమ్యూనిటీ నివసించే ప్రాంతాల్లో వారి సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సర్వే నిర్వహించాల్సి ఉంటుంది. ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఉపాధి, స్వయం ఉపాధి పొందడంలో ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లను అధికారులు గుర్తిస్తారు. అనంతరం వారి అభివృద్ధి కోసం మైనార్టీ సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా అందించగల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అనుసంధానంపై ప్రభుత్వానికి తగిన సూచనలు చేస్తారు. ఈ సమగ్ర అధ్యయనం పూర్తయిన తర్వాత నిర్దిష్టమైన సిఫార్సులతో కూడిన పూర్తి స్థాయి నివేదికను తదుపరి చర్యల కోసం జిల్లా కలెక్టర్‌కు సమర్పించాల్సి ఉంటుంది. కమిటీ సభ్యులతో వెంటనే సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయి అధ్యయనాన్ని తక్షణమే ప్రారంభించాలని చైర్మన్‌గా ఉన్న ఇచ్చోడ తహసీల్దార్‌ను కలెక్టర్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్