vaasthavanestham.com
Date of Publish : 24 September 2026, 9:34 pm Posted by : VAASTHAVA NESTHAM MEDIA

వీఆర్వో సస్పెన్షన్‌ హర్షణీయం.. భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి

• ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ వద్దు

• కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ వాయిస్ డిమాండ్

 

వాస్తవ నేస్తం,హైదరాబాద్: భూ అక్రమాల ఆరోపణల నేపథ్యంలో డోన్ క్లస్టర్–1 వీఆర్వో ఎం. మల్లారెడ్డిని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయడాన్ని కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ వాయిస్ స్వాగతించింది. కేవలం సస్పెన్షన్‌తోనే ఈ వ్యవహారాన్ని ముగించకుండా, భూ రికార్డులపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ, గ్రామకంఠం భూములను పరిరక్షించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీసీవీ ప్రతినిధులు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ప్యాపిలి మండలం మాధవరం, గార్లదిన్నె గ్రామాలకు సంబంధించి గ్రామకంఠం, ప్రభుత్వ, అసైన్డ్ భూముల ఆక్రమణలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, రహదారి ఆక్రమణలు, లంచం తదితర వ్యవహారాలపై సీసీవీ గతంలో జిల్లా కలెక్టర్‌కు ఆధారాలతో ఫిర్యాదు చేసింది. దీనిపై జాయింట్ కలెక్టర్, ఆర్డీవో స్థాయిలో విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. వారి నివేదికల ఆధారంగా వీఆర్వోపై సస్పెన్షన్ వేటు వేశారు. త్వరలోనే గార్లదిన్నె గ్రామాన్ని స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితులు, భూ సమస్యలపై సమీక్షిస్తామని కలెక్టర్ తమకు హామీ ఇచ్చినట్లు సీసీవీ ప్రతినిధులు తెలిపారు.

ఆ సర్వే నంబర్ల రికార్డులను పరిశీలించాలి..

 

మాధవరం గ్రామంలో సర్వే నంబర్లు 507-A, 507-Bలోని గ్రామకంఠం భూముల బదలాయింపులు, సర్వే నంబర్ 565లోని అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు, సర్వే నంబర్లు 670, 676లలో రహదారి ఆక్రమణల ఆరోపణలపై విచారణ సాగింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ 18న వీఆర్వో ఇచ్చిన వివరణలో తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారని సీసీవీ గుర్తుచేసింది. తుది నివేదిక వచ్చే వరకు ఏ ఆరోపణనూ వాస్తవంగా పరిగణించలేమని, కాబట్టి పూర్తిస్థాయిలో లోతైన విచారణ జరగాలని కోరింది.

దీనికోసం అసలు రెవెన్యూ రికార్డులు, అసైన్‌మెంట్ రిజిస్టర్లు, గ్రామ మ్యాపులు, ఎఫ్‌ఎంబీలు పట్టా రికార్డులు, సేల్ డీడ్స్, ఈసీలను క్షుణ్ణంగా పరిశీలించాలని సీసీవీ అధికారులకు విజ్ఞప్తి చేసింది. విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలితే.. ఇందుకు సహకరించిన ఇతర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు, ప్రైవేటు వ్యక్తులు, మధ్యవర్తులపైనా నిష్పక్షపాతంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రభుత్వ భూమి ప్రజా సంపద అని, దాని పరిరక్షణలో జిల్లా యంత్రాంగం పారదర్శకంగా వ్యవహరించాలని సీసీవీ స్పష్టం చేసింది.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్