పండుగ సీజన్‌లో సామాన్యులపై ధరల భారం మరింత పెరిగింది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన ‘నయారా ఎనర్జీ’ పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ సవరించిన ధరలు శనివారం నుంచే తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా నయారా నిర్వహిస్తున్న 7 వేలకు పైగా రిటైల్ అవుట్‌లెట్లలో ఈ పెరిగిన ధరలు (Nayara Energy Fuel Prices) వర్తిస్తాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో కంపెనీ మార్జిన్లపై తీవ్ర ఒత్తిడి పడుతోందని, అందుకే ధరలను పెంచాల్సి వచ్చిందని సంస్థ తన ప్రకటనలో వివరించింది.
ఈ ఏడాది ఆరంభంలో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల క్రమంలో ముడిచమురు ధరలు పెరిగినప్పుడు కూడా నయారా సంస్థే మొదటిసారిగా ఇంధన ధరలను పెంచింది. గత మార్చి 26న లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంచడంతో ఆ సంస్థ బంకుల్లో పెట్రోల్ రూ.100.71, డీజిల్ రూ.91.31కి చేరాయి. ఆ తర్వాత ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు కూడా విడతల వారీగా ధరలను పెంచాయి. అనంతరం అంతర్జాతీయ పరిస్థితులు కాస్త చల్లబడటంతో జూలై 1న నయారా సంస్థ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గించి ఊరటనిచ్చింది. అయితే, ఇప్పుడు దసరా పండుగకు ముందే మళ్లీ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ఇంధన ధరల పెరుగుదల (Petrol and Diesel Rates) మళ్లీ ఊపందుకుంది.
మండిపోతున్న నిత్యావసరాలు.. బెంబేలెత్తుతున్న సామాన్యుడు:
ఒకవైపు దసరా పండుగ సమీపిస్తున్న వేళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు మరింత ప్రియమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే అక్టోబర్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. మరోవైపు బహిరంగ మార్కెట్‌లో ఉల్లిపాయల ధరలు కిలో రూ.60 నుంచి రూ.70 పలుకుతుండగా, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకుల ధరలు కూడా చుక్కలనంటుతున్నాయి. దీనికి తోడు అక్టోబర్ 1వ తేదీ నుంచి ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ వంటి హోమ్ ఎలక్ట్రానిక్స్ ధరలు కూడా పెరిగాయి. పండుగ వేళ ఈ స్థాయిలో ధరల భారం (Dussehra Price Hike) పెరగడంతో ఇంటి ఖర్చులు వెళ్లదీయలేక సామాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!