vaasthavanestham.com
Date of Publish : 24 November 2026, 9:11 am Posted by : VAASTHAVA NESTHAM MEDIA

నేరడిగొండ సమస్యలపై కలెక్టర్‌కు వినతుల వెల్లువ

• ప్రజావాణిలో మూడు వేర్వేరు వినతిపత్రాలు అందజేత 

• ప్రభుత్వ కార్యాలయాలు, పశు వైద్యశాల నిర్మాణానికి డిమాండ్

• జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్లు, ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి

 

వాస్తవ నేస్తం,నేరడిగొండ : మండల కేంద్రంలో నెలకొన్న దీర్ఘకాలిక ప్రజా సమస్యలను పరిష్కరించి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కోరుతూ సామాజిక కార్యకర్తలు సాబ్లే సంతోష్ సింగ్, బొంతుకుల శ్రీను జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు మూడు వేర్వేరు వినతిపత్రాలను అందజేశారు.

మండల కేంద్రంలోని తహసీల్దార్, ఎంపీడీఓ, ఐకేపీ, ఉపాధిహామీ కార్యాలయాలతో పాటు ఆధార్ నమోదు కేంద్రం తీవ్ర శిథిలావస్థకు చేరుకున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వర్షం పడితే పైకప్పుల నుంచి నీరు కారుతూ విలువైన ప్రభుత్వ రికార్డులు, పాత ఫైళ్లు తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేక కార్యాలయాలకు వచ్చే మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వీటన్నింటినీ ఒకే గొడుకు కిందకు తెస్తూ ఆధునిక సౌకర్యాలతో కూడిన సమీకృత ప్రభుత్వ కార్యాలయ సముదాయాన్ని (ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్) నిర్మించాలని కోరారు. ప్రభుత్వ పశు వైద్యశాల భవనం పూర్తిగా శిథిలమైందని, దీనివల్ల రైతులు, పశుపోషకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నూతన భవనం నిర్మించి, ఆధునిక వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.

హైవే సమస్యలు పరిష్కరించండి.. ఫ్లైఓవర్ నిర్మించండి..

మూడవ వినతిపత్రంలో మండల కేంద్రం మీదుగా వెళ్లే జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ఏఐ) సమస్యలను ప్రస్తావించారు. కుంటాల రోడ్డు నుంచి ధాబా హోటళ్ల వరకు హైవేకు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించాలని, గతంలో మంజూరైనట్లు చెప్పిన ఈ పనుల ప్రస్తుత స్థితిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. పశువులు రోడ్డుపైకి రాకుండా పటిష్టమైన ఫెన్సింగ్, బారికేడ్లు ఏర్పాటు చేయాలని, దెబ్బతిన్న డ్రైనేజీలకు మరమ్మతులు చేపట్టాలని విన్నవించారు. రాత్రివేళ ప్రమాదాల నివారణకు వీధి దీపాలు, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు.

గతంలో ఫ్లైఓవర్ లేకుండా గ్రామం మధ్యలో హైవే నిర్మించడం వల్ల నేరడిగొండ రెండు భాగాలుగా విడిపోయి స్థానిక వ్యాపారాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో రహదారిని ఆరు వరుసలుగా విస్తరించే పక్షంలో గ్రామంలో తప్పనిసరిగా ఫ్లైఓవర్ నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. ఈ మూడు అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, నేరడిగొండ ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సాబ్లే సంతోష్ సింగ్, బొంతుకుల శ్రీను విజ్ఞప్తి చేశారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్