vaasthavanestham.com
Date of Publish : 27 October 2025, 5:37 am Posted by : VAASTHAVA NESTHAM MEDIA

Rabies disease | రేబిస్ వ్యాధితో చిన్నారి మృతి

• నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి ఘటన

• కుక్క కరిచిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పని చిన్నారి

వాస్తవ నేస్తం,నిజామాబాద్ : కుక్క తనను కరిచిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకు ఆ చిన్నారి చెప్పలేదు. చివరకి రేబిస్ వ్యాధి తో (Rabies disease) ఆ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని బాల్కొండ చెందిన 10 ఏళ్ల బాలిక కుక్క కాటుకు గురైన నెల రోజుల తర్వాత రేబిస్ వ్యాధితో మరణించింది. భయంకరమైన ఈ వ్యాధి గురించి తెలియక ఆ చిన్నారి కుక్క కరిచిన విషయాన్ని దాచిపెట్టడం వల్లే బాలిక ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. లక్ష్మణ అనే బాలికను దాదాపు నెల రోజుల క్రితం ఒక కుక్క కరిచింది. ఈ దాడిలో ఆమె తలకు గాయమైంది. అయితే.. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే వారు మందలిస్తారేమోనని భయపడి.. బాలిక ఈ సంఘటన గురించి ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. మూడు రోజుల క్రితం లక్ష్మణ ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు వచ్చింది. ఆమె కుక్కలా మొరగడం వంటి అసాధారణంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో బాలిక రేబిస్ వ్యాధికి పూర్తిగా లోనైందని వైద్యులు నిర్ధారించారు. చికిత్స పొందుతూ లక్ష్మణ మరణించింది.

ఈ విషాద ఘటనతో వైద్యులు ప్రజలను అప్రమత్తం చేశారు. కుక్క కాటు అనేది చిన్న గాయంగా కనిపించినా.. అది రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధికి దారితీసే ప్రమాదం ఉంది. అది పెంపుడు కుక్క అయినా, వీధి కుక్క అయినా సరే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రేబిస్ టీకా తీసుకోవాలని వైద్యులు గట్టిగా సలహా ఇస్తున్నారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా చిన్న పిల్లలు కుక్క కాటును దాచిపెట్టే ప్రమాదం ఉన్నందున.. తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, పిల్లలకు రేబిస్ ప్రమాదం గురించి అవగాహన కల్పించాలని కోరారు. సకాలంలో సరైన చికిత్స తీసుకుంటే రేబిస్ ను నివారించవచ్చని వైద్యులు స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలపై పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!




జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్