• గుస్సాడీ నృత్యాలతో అలరిస్తున్న ఆదివాసీలు
• ఆటపాటలతో మార్మోగుతున్న ఆదివాసీ గూడాలు
• ఆదివాసి గూడెల్లో పండగ వాతావరణం
• ఆదివాసుల ఆరాధ్య దేవత ‘ఏత్మాసార్ పేన్’ కు ప్రత్యేక పూజలు
• పూర్వీకుర ఆచారాలు తూచా తప్పకుండా పాటిస్తున్న ఆదివాసులు
• తారాలు మారుతున్న నేటికీ ప్రత్యేకంగా నిలుస్తున్న ఆదివాసుల ఆచారాలు
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: తరతరాలు మారిన కూడా ఆదివాసులు తమ ఆచారాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. తమ పూర్వికుల నుండి వచ్చిన ఆచారాలను తమ తర్వాతి తరాలకు అందిస్తున్నారు. ఆదివాసులు దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించే దండారి ఉత్సవాల పైన “వాస్తవ నేస్తం” ప్రత్యేక కథనం..
ఆదిలాబాద్ ఆదివాసీ గూడాల్లో దండారి సంబురం మొదలైంది. డప్పుల దరువులు, గజ్జల మోతలు, గుస్సాడీ నృత్యాలతో అడవి తల్లి మురిసిపోతుంది. ప్రతి యేటా ఆదివాసులు
అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే ఆరాధ్య దేవత ‘ఏత్మాసార్ పేన్’ పేరిట చేసే ప్రత్యేక పండుగతో దండారి ప్రారంభమవుతుంది. దీపావళికి ముందు భోగిపండుగతో ప్రారంభమై, కొలబోడితో ముగిస్తుంది. పక్షం రోజుల పాటు సాగే ఈ వేడుక తరతరాల సంప్రదాయాన్ని కొనసాగించే అద్భుత పండుగగా నిలుస్తోంది. అడవి తల్లి ఒడిలో అంగరంగ వైభవంగా సాగే దండారి పండుగ ఆచారాలు, వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపడుతోంది.
ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా తుడుం మోతల చప్పుల్లు, గుస్సాడీ ఆటపాటలే కనువిందు వేస్తున్నాయి. తరతరాల సంప్రదాయాన్ని తూచ తప్పకుండాపాటించే సంస్కృతి సంప్రదాయాల పుట్టినిళ్లుగా నిలుస్తూ ఆదివాసీ గూడాలు రారమ్మంటూ స్వాగతం పలుకుతాయి. డప్పుల దరువులు, గజ్జెల మోతలు, గుస్సాడీల నృత్యాలతో గూడేలన్నీ మారుమోగుతాయి. ఓ వైపు కోలాటాలు, మరోవైపు గోండిపాటల నృత్యాలు, హాస్యవాటికల ప్రదర్శనలు అబ్బురపరుస్తాయి. ఆశ్వీయుజ పౌర్ణమి అనంతరం ప్రారంభమయ్యే ఈ వేడుకలు అంగరంగవైభవంగా సాగుతాయి. దండారి పండగ వేళ చేసే గుస్సాడీ నృత్యాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఈ పండుగలో ఆదివాసీలు కట్టుబొట్టు ఎంత అద్భుతంగా ఉంటుందో పండుగ వేళ చేపట్టే దీక్ష అంత కఠినంగా ఉంటుంది.
దండారి వేడుకల్లో గుస్సాడీల పాత్ర కీలకమైంది. నెమలి పింఛంతో చేసిన టోపీలు, టోపికి ముందు రెండు పశువుల కొమ్ములు, మధ్యలో ఓ అద్దం, చుట్టూ అలంకరణ వస్తువులు, భుజానికి వన్యప్రాణుల తోలు, నడుము, కాళ్లకు గజ్జెలు, మెడలో రుద్రాక్షమాల వేసిన ఆదివాసీ దేవుని ప్రతిరూపమే గుస్సాడీలు. గోండి భాషలో వారిని గుస్సాడికి బదులు ‘గురు’ అని పిలుస్తారు. భోగి పండుగతో మాలధారణ వేసిన్నప్పటి నుంచి వారు దీక్షలో కొనసాగుతారు. దీక్ష చేపట్టిన నాటి నుంచి పూర్తయ్యే వరకు స్నానాలు ఆచారించకుండా, చలిలోనూ పాదరక్షలు, అర్ధ దుస్తులు ధరించి, మంచం, కుర్చీలు, సోపాలో కాకుండా నేల పైనే కూర్చోవడం, నిద్రించడం వారి ఆచారం.
దండారిలో మరో పాత్ర..
దండారి ఉత్సవంలో పాల్గొనే గుస్సాడీల తర్వాత మరో కీలక పాత్ర పోరీలది (ఆడ వేషధారణలో ఉండే యువకులు), వీరు కూడా గుస్సాడీలతో చివరి రోజైన కొలబోడి వరకు దీక్షలో కొనసాగుతారు. ఏ ఊరికి వెళ్లిన, ఏ ఇంటిని సందర్శించిన ఈ పోరీలు మంగళహారతులతో అష్ట, ఐశ్వర్యాలు కలగాలని, కుటుంబ సభ్యులందరికీ సుఖశాంతులు కలగాలనీ దీవిస్తారు. దండారీ పండుగ అంటేనే ఐక్యమత్యానికి నిదర్శనం ఈపండుగ వేళ ఆదివాసీ గ్రామాల గిరిజనం ఒక ఊరు నుండి మరో ఊరికి విడిదికి వెళ్లడం ఆనవాయితీ, మారు మూల గిరిజన గ్రామాల గిరిజనం పండుగ వేళ ఓ గ్రామంనుండి దండారి బృందంతో మరో గ్రామానికి బయలుదేరి వెళుతారు. అలా చేయడం ద్వారా రెండు గ్రామాల మద్య సత్సంబంధాలు, బాందవ్యాలు పెరుగుతాయని చెప్తారు. ఆదివాసీ పటేళ్లు. ఇలా విడిదికి వెళ్లే దండారీ బృందంకాలినడకనే ఎంచుకుంటారు. అందులోనూ రాత్రి పూటమాత్రమే వెళ్లడం వారి ఆచారం రాత్రిలో నృత్యాలు చేస్తూ, ఎలారేలా ఆటపాటలతో.. గోండి హాస్యపు నాటికలు ప్రదర్శించి వినోదాన్ని అందిస్తారు. ఈ సందర్భంగా వచ్చిన అథితులకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక విందును ఏర్పాటు చేసి అతిదులకు వీడ్కోలు పలుకుతారు. అలా తమ గూడానికి వచ్చిన గుస్సాడీలతో ఆత్మీయ బందం ఏర్పడి రెండు గూడాల మధ్య స్నేహబందం మరింత బలపడి తరతరాలుగా కొనసాగిస్తున్న సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు తోడ్పడుతుందనేది వారి భావన..

కొలబోడితో వేడుకలు ముగింపు..
ఎంతో వైభవంగా ఉత్సవాలు జరుపుకున్న తర్వాత కొలబొడితో వేడుకలు ముగిస్తారు. తమ కార్యక్రమాలు, అతిథుల రాకపోకలు పూర్తి కాగానే గ్రామంలోని దండారి బృందం ఇంటింటికీ వెళ్లి దర్శనం ఇస్తారు. దీంతో ఇంటి
గృహిణి ఓ పల్లెంలో ధాన్యాలు, తోచిన నగదు ఉంచిన హారతిని వారికి అందిస్తారు. దానిని వారు సంతోషంగా స్వీకరించి ఇంట్లో అందరూ బాగుండాలని, పాడిపంటలు సమృద్ధిగా పెంపొందాలని పాటలు పాడుతూ హారతి ఇస్తారు. ఇలా అన్ని ఇండ్లు పూర్తి కాగానే, కాలబొడి నిర్వహించి కార్యక్రమాన్ని ముగిస్తారు.