గొప్ప విద్య, మంచి కొలువు అంటే జీవితానికి అన్నీ సమకూరినట్టే అనే భ్రమలో మన యువతరం ఉంది. కానీ వాస్తవంగా, అధిక వేతనాలు అందుకుంటున్న యువ నిపుణులే వేగంగా మానసిక ఆందోళనతో సతమతమవుతున్నారు. “నాకు అస్సలు తీరిక లేదు” అనే మాట కార్పొరేట్ వర్గాలలో ఒక గౌరవ ముద్రగా మారింది. అత్యధిక ధనం ఉన్నప్పటికీ, నిశ్శబ్దంగా ఏకాంతాన్ని కోల్పోతున్న ఈ పరిస్థితిని ‘బంగారు పంజరం’ అని పిలవక తప్పదు. చైనాలోని ‘996’ (పని విధానం), జపాన్‌లోని ‘కరోషి’ (అధిక పనిభారం వల్ల మరణం) వంటి విషాదాలు భారత కార్పొరేట్ రంగంలో గుట్టుగా విస్తరిస్తున్నాయి. ప్రతిభకు, శ్రమకు విలువ ఇస్తున్న చోట, మానవత్వానికి విలువ కొరవడినప్పుడు, ఈ పోరాటం కేవలం పని గడువులతోనే కాదు, మన జీవిత లక్ష్యాలతోనూ మొదలవుతుంది. ఈ విషపూరిత వాతావరణం మానసిక ఒత్తిడిని పెంచి, ఉద్యోగిని డబ్బు దాస్యంలో బంధిస్తోంది.
కార్పొరేట్‌తో కరిగిపోయిన ఇంటి హద్దులు :
ఇంటి నుండే పని విధానం.. సౌకర్యాన్ని ఇస్తుందని అనుకున్నా, స్వేచ్ఛను హరించివేసింది. కార్యాలయం, ఇల్లు అనే భౌతిక సరిహద్దులు పూర్తిగా చెరిగిపోయాయి. ఒక ఉన్నతాధికారి అర్థరాత్రి పంపే సందేశం, ఉద్యోగి కుటుంబంతో గడపాల్సిన శాంతి కాలాన్ని క్షణాల్లో నాశనం చేస్తుంది. పరిశోధనల ప్రకారం, ఇంటి నుండి పనిచేసే ఉద్యోగులు సగటున 2 నుంచి 3 గంటలు ఎక్కువ పనిచేస్తున్నారు. ఈ ఒత్తిడి, అధిక పని భారానికి ప్రభుత్వం లేదా సంస్థల నుండి పరిష్కారం వస్తుందని ఎదురుచూడటం అర్థరహితం. అందుకే, ప్రతి ఉద్యోగి తన ‘స్వీయ-రక్షణ’ గురించి తప్పక ఆలోచించాలి. రాత్రి 9 గంటల తర్వాత ఆఫీసుకు సంబంధించిన సందేశాలను చూడకపోవడం, వారాంతాల్లో ఒక రోజు పూర్తిగా సాంకేతిక దూరంగా (ఫోన్లు, కంప్యూటర్లు వాడకపోవడం) ఉండటం వంటి కఠినమైన హద్దులను మీరే గీసుకోవాలి. సంతోషంగా ఉన్న ఉద్యోగి, ఒత్తిడిలో ఉన్న ఉద్యోగి కంటే 21 శాతం ఎక్కువ ఉత్పాదకతను ఇస్తారన్న నిజాన్ని సంస్థలు గుర్తించాలి.
అలసటను జయించే ఆత్మశక్తి.!
తీవ్రమైన అలసటను జయించడానికి ఉన్న ఏకైక మార్గం మన నిజమైన అభిరుచిని కనుగొనడం. ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే తన ఉన్నత విద్య తర్వాత కూడా, ఎక్కువ వేతనాల ఉద్యోగాన్ని వదిలి, తన ఇష్టమైన వ్యాఖ్యానం వైపు వచ్చారు. ఇష్టమైన రంగంలోకి ప్రవేశించడానికి ఎప్పుడూ పెద్ద సాహసం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుత ఆదాయానికి భద్రత కల్పిస్తూనే, అభిరుచికి సంబంధించిన పనిని అదనపు ప్రయత్నాలుగా మొదలుపెట్టాలి. చేసే పని మీకు ఆనందాన్ని ఇస్తే, కష్టపడటం అనేది ప్రయాణం అవుతుంది. అదే పని మీకు భయాన్ని ఇస్తే, కష్టపడటం అనేది శిక్ష అవుతుంది. మనకు నచ్చిన రంగంలో పనిచేస్తే, మనం డబ్బు కోసం పనిచేస్తున్నట్లు అనిపించదు. ఈ ఆత్మ సంతృప్తే తీవ్రమైన అలసటను శాశ్వతంగా దూరం చేస్తుంది.
బానిస సంకెళ్లు తెంచండి.!
మీరు మీ సంస్థ పనులకు ఎంత సమయం, శక్తిని కేటాయిస్తున్నారో, మీ వ్యక్తిగత జీవిత లక్ష్యాలకు కూడా అంతే శక్తిని కేటాయించండి. మీరు కార్యాలయంలో ఇతరులకు నాయకులు కావచ్చు, కానీ మీ ఆరోగ్యానికి, ఆనందానికి నిజమైన నాయకులు, యజమానులు మీరే. మీ జీవితం ఎంతో విలువైనది. ఏ కంపెనీ, ఏ జీతం కూడా మీ శాశ్వత సంతోషాన్ని కొనలేదు. అందుకే, నేటి నుండే మీ సరిహద్దులను గీయండి, మీ ఆసక్తిని అనుసరించండి మరియు అత్యంత ముఖ్యమైన బాధ్యత.. మీ మీద మీకు బాధ్యత వహించడం తీసుకోండి. చాలా ఆలస్యం కాకముందే, ఈ ‘బంగారు పంజరం’ సంకెళ్లను తెంచుకొని, నిజమైన స్వేచ్ఛ వైపు ధైర్యంగా అడుగులు వేయండి.
వ్యాసకర్త : ఫిరోజ్ ఖాన్, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ 9640466464
