భారతీయుల జీవితాల్లో బంగారం, వెండి కేవలం లోహాలు మాత్రమే కాదు. భవిష్యత్తులోని తమ తరాలకు ఒక ఆర్థిక ఆస్తిగా పరికనించబడుతుంది. ఇంట్లో పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటే ముందుగా గుర్తొచ్చేది పసిడే. అంతేకాదు, ఆర్థిక అత్యవసర సమయాల్లో ఆదుకునే నమ్మకమైన ఆస్తిగా కూడా బంగారం, వెండికి ప్రత్యేక స్థానం ఉంది. కానీ ఇటీవల ధరలు భారీగా పెరగడంతో చాలా మంది ఇన్వెస్టర్లు “ఇదే సరైన సమయం” అంటూ అమ్మకాలకు సిద్ధమవుతున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ధరలు పెరిగినంత మాత్రాన అమ్మేస్తే, లాభం మొత్తం మన చేతికి వస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానం..“అవసరం లేదు” అనే చెప్పాలి. ఎందుకంటే బంగారం లేదా వెండి అమ్మకాల విషయంలో టైమింగ్ తప్పితే, లాభం కన్నా పన్నులే ఎక్కువగా బాధించే పరిస్థితి వస్తుంది. సరైన అవగాహన లేకుండా ఎగ్జిట్ అయితే, మీరు సంపాదించిన లాభంలో గణనీయమైన భాగం ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి వెళ్లిపోతుంది. కొన్నిసార్లు ఈ పన్ను భారం 18 శాతం పైగానే తేడా చూపిస్తుంది.
హోల్డింగ్ పీరియడే అసలైన గేమ్ ఛేంజర్..
భారత ఆదాయపన్ను చట్టం ప్రకారం బంగారం, వెండి అమ్మకాల ద్వారా వచ్చే లాభాన్ని క్యాపిటల్ గెయిన్స్,గా పరిగణిస్తారు. ఇవి రెండు రకాల.. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. మీరు ఆ ఆస్తిని ఎంతకాలం పట్టుకున్నారన్నదే ఇక్కడ కీలకం. భౌతిక బంగారం, వెండి లేదా డిజిటల్ గోల్డ్‌ను 24 నెలల కన్నా తక్కువగా ఉంచి అమ్మితే, అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఈ లాభంపై మీకు వర్తించే ఆదాయపన్ను స్లాబ్ ప్రకారం ట్యాక్స్ చెల్లించాలి. మీరు 30 శాతం స్లాబ్‌లో ఉంటే, సెస్‌తో కలిపి దాదాపు 31.2 శాతం వరకు పన్ను పడుతుంది. అంటే లాభంలో మూడో వంతు ట్యాక్స్‌గా పోయినట్టే.
అదే ఆస్తిని 24 నెలలకంటే ఎక్కువగా ఉంచి అమ్మితే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వర్తిస్తాయి. ఈ సందర్భంలో పన్ను రేటు చాలా తక్కువ. ప్రస్తుతం 12.5 శాతం ట్యాక్స్‌కు 4 శాతం సెస్ కలిపి మొత్తం సుమారు 13 శాతం మాత్రమే. కొద్దిరోజులు ఆగితే సరిపోతుందన్న విషయం తెలియక చాలామంది తొందరపడి అమ్మేసి, అనవసరంగా ఎక్కువ పన్ను చెల్లిస్తున్నారనే చెప్పాలి.
ETFలు, SGBల విషయంలో ప్రత్యేక నియమాలు
గోల్డ్ లేదా సిల్వర్ ETFల విషయంలో హోల్డింగ్ పీరియడ్ నిబంధన కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ 12 నెలలే కీలకం. ఒక సంవత్సరం లోపు అమ్మితే షార్ట్ టర్మ్, ఏడాది దాటితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వర్తిస్తాయి. కాబట్టి ETF ఇన్వెస్టర్లు కూడా ఎగ్జిట్ టైమింగ్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇక సార్వభౌమ గోల్డ్ బాండ్లు (SGBలు) దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు బంగారు అవకాశమే. ఎనిమిదేళ్ల మెచ్యూరిటీ వరకు పట్టుకుని రిడీమ్ చేస్తే, ధరల పెరుగుదలపై వచ్చే లాభానికి పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే మధ్యలో అమ్మితే మాత్రం సాధారణ క్యాపిటల్ గెయిన్స్ నిబంధనలు వర్తిస్తాయి. మరోవైపు, ఈ బాండ్లపై వచ్చే వార్షిక వడ్డీకి మాత్రం మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారమే పన్ను చెల్లించాలి.

బంగారం, వెండి పెట్టుబడుల్లో లాభం ఎంత వచ్చిందన్నదికంటే, ఆ లాభాన్ని ఎప్పుడు బుక్ చేస్తున్నామన్నదే అసలైన కీలక అంశం. కొద్దిపాటి ఆలస్యం మీ నికర లాభాన్ని భారీగా పెంచగలదు. అందుకే అమ్మే ముందు పన్ను నిబంధనలపై స్పష్టత తప్పనిసరి. ఆలోచించి మరి నిర్ణయం తీసుకోవాలని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.
Written by: Qamar SD, Vaasthava Nestham Editorial Team, Published: January 21, 2025 | 05:25 PM
