Friday, May 29, 2026
HomeTelanganaమహామహుల సరసన మన జిల్లా న్యాయవాది

మహామహుల సరసన మన జిల్లా న్యాయవాది

• ప్రతిష్టాత్మక ‘ఎన్టీఆర్’ అవార్డుల ప్రదానోత్సవానికి ఆత్మీయ అతిథిగా సుధీర్ కుమార్ సంగెం

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: సమాజ సేవలో, న్యాయవాద వృత్తిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మన జిల్లా న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధీర్ కుమార్ సంగెంకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ‘ఎన్టీఆర్ అవార్డుల ప్రదానోత్సవ’ కార్యక్రమానికి ఆయనకు ఆత్మీయ అతిథిగా ప్రత్యేక ఆహ్వానం అందింది. మహామహులైన రాజకీయ, సినీ ప్రముఖులతో కలిసి ఆయన వేదికను పంచుకోనుండటం పట్ల జిల్లా వ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు స్మారకార్థం ప్రతి ఏడాదీ సామాజిక కార్యకర్తలకు, సినీ ప్రముఖులకు, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి ‘ఎన్టీఆర్ అవార్డు’లను ప్రదానం చేస్తున్న విషయం విదితమే. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు ‘సత్య సంగీత ఇంటర్నేషనల్’ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 29న హైదరాబాద్‌లోని ప్రముఖ కళాక్షేత్రం ‘శ్రీ త్యాగరాయ గానసభ’లో ఈ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది.

హాజరుకానున్న రాష్ట్ర ప్రముఖులు, సినీ తారలు: 

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు, శాసనసభ మాజీ స్పీకర్ శ్రీ సిరికొండ మధుసూదనాచారి, తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ శ్రీ వకుళాభరణం కృష్ణమోహన్, సత్య సంగీత ఇంటర్నేషనల్ అధ్యక్షులు శ్రీ ఓంకార్ రాజు హాజరుకానున్నారు. అలాగే, ప్రముఖ సినీ తారలు రాధిక, సుప్రియ, గీతాంజలి తదితరులు ఈ వేడుకలో పాల్గొంటారు. ఇంతటి ఉద్ధండుల సరసన సుధీర్ కుమార్ సంగెం ఆత్మీయ అతిథిగా పాల్గొని, వారి చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవంలో భాగస్వామ్యం కానుండటం జిల్లాకే గర్వకారణంగా పలువురు కొనియాడుతున్నారు. నిరంతరం సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ఆయనకు ఈ గుర్తింపు దక్కడం పట్ల తోటి న్యాయవాదులు, జిల్లా ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.

ఈ అరుదైన అవకాశం రావడం పట్ల న్యాయవాది సుధీర్ కుమార్ సంగెం సంతోషం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ లాంటి మహనీయుని పేరు మీద జరిగే ఈ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొనడం, అదీ రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, సినీ తారల మధ్య ఆత్మీయ అతిథిగా ఆహ్వానం అందుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular