• విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మల తొలగింపు
• సురక్షితంగా మార్చిన విద్యుత్ శాఖ అధికారులు
• ఊపిరి పీల్చుకున్న హనుమాన్ ఆలయ భక్తులు, గ్రామస్తులు
• సమస్యను వెలుగులోకి తెచ్చిన ‘వాస్తవ నేస్తం’ పట్ల హర్షం
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: జిల్లాలోని బజార్హత్నూర్ మండలం వర్ధమానూర్ గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించారు. గ్రామంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాల వద్ద కరెంట్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయని, వీధుల్లోని విద్యుత్ వైర్లు చెట్ల కొమ్మలపై ప్రమాదకరంగా వేలాడుతుండటంపై ‘వాస్తవ నేస్తం’ దినపత్రికలో “విద్యుత్ స్తంభం ముట్టుకుంటే.. షాకే..!” అనే శీర్షికతో వార్త ప్రచురితమైన విషయం విధితమే.
ఈ కథనానికి విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించారు. వెంటనే వర్ధమానూర్ గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదకరంగా విద్యుత్ వైర్లకు తగులుతున్న చెట్ల కొమ్మలను నరికేసి, వైర్లను సురక్షితంగా మార్చారు. స్తంభాలకు వస్తున్న విద్యుత్ లీకేజీని అరికట్టి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీట్ గా చర్యలు చేపట్టారు.

నిత్యం భక్తులు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగించే హనుమాన్ ఆలయ పరిసరాల్లో ఈ సమస్య పరిష్కారం కావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పెను ప్రమాదం జరగకముందే అప్రమత్తమై సమస్యను పరిష్కరించిన విద్యుత్ శాఖ అధికారులకు, అలాగే తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసిన ‘వాస్తవ నేస్తం’ పత్రికకు వర్ధమానూర్ గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!
జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్