📄 ePaper
Saturday, April 4, 2026
📄 ePaper
HomeHistorical FiguresChhatrapati Shivaji Maharaj | మొఘలుల పాలిట సింహస్వప్నం.. సొంత గడ్డపై కుల వివక్ష.!ఛత్రపతి శివాజీ...

Chhatrapati Shivaji Maharaj | మొఘలుల పాలిట సింహస్వప్నం.. సొంత గడ్డపై కుల వివక్ష.!ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మీకు తెలియని నిజాలు..

భారతదేశ చరిత్రలో వీరత్వానికి, గెరిల్లా పోరాట పటిమకు నిలువెత్తు నిదర్శనం ఛత్రపతి శివాజీ మహారాజ్. మొఘల్ సామ్రాజ్యం దెబ్బకు దేశంలోని రాజులంతా చేతులెత్తేసిన చీకటి రోజుల్లో.. ఒక నిప్పుకణికలా దూసుకొచ్చి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరుడాయన.  అయితే, కత్తి పట్టి శత్రువుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన ఆ మహాయోధుడికి, సొంత గడ్డపై మాత్రం అడుగడుగునా అవమానాలు, కుల వివక్ష ఎదురయ్యాయన్నది చరిత్రలో చాలా మందికి తెలియని పచ్చి నిజం. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా, ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన, వివాదాస్పదమైన కోణాలపై ప్రత్యేక కథనం..

చరిత్రలో రెండుసార్లు పట్టాభిషేకం.. ఎందుకంటే?

యుద్ధభూమిలో వందలాది కోటలను జయించిన శివాజీకి, సింహాసనం అధిష్టించే సమయంలో అనూహ్యమైన అడ్డంకులు ఎదురయ్యాయి. ఆయన స్వతహాగా వ్యవసాయం చేసుకునే ‘భోస్లే’ కులానికి (శూద్రులు) చెందినవారు కావడంతో, మహారాష్ట్రలోని బ్రాహ్మణులు ఆయన పట్టాభిషేకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. శాస్త్రాల ప్రకారం క్షత్రియులు లేదా బ్రాహ్మణులకు మాత్రమే రాజయ్యే అర్హత ఉందని వారు వాదించారు.

దీంతో, 1674 జూన్ 6న కాశీ (బెనారస్) నుంచి గగాభట్ అనే బ్రాహ్మణుడిని భారీగా కానుకలు ఇచ్చి రప్పించారు. అయితే, ఆయన కూడా శివాజీని తన చేతులతో తాకడానికి ఇష్టపడక, ఎడమ కాలి బొటనవేలుతో నుదుటిపై తిలకం దిద్దినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే శివాజీ తల్లి జిజాబాయి మరణించడం, ముహూర్తం బాగాలేదని నిశ్చల్‌పురి గోస్వామి అనే మరో బ్రాహ్మణుడు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. 1674 సెప్టెంబర్ 24న శివాజీకి రెండవసారి పట్టాభిషేకం నిర్వహించాల్సి వచ్చింది.

గెరిల్లా వ్యూహాలు.. ఆగ్రా కుట్ర నుంచి వీరోచిత ఎస్కేప్

శివాజీ అనగానే ప్రపంచానికి ముందుగా గుర్తొచ్చేది ఆయన ‘గెరిల్లా యుద్ధ వ్యూహాలు’. కొండన (సింహగఢ్) కోటను స్వాధీనం చేసుకోవడానికి ఆయన సేనాని తానాజీ మలుసారే.. ఏకంగా ‘యశ్వంతి’ అనే ఉడుమును ఉపయోగించి శత్రు దుర్భేద్యమైన కోటను వశం చేసుకోవడం యుద్ధ తంత్రానికే ఒక మాస్టర్ పీస్. ఈ యుద్ధంలో తానాజీ మరణించడంతో శివాజీ “కోటను గెలిచాము కానీ సింహాన్ని పోగొట్టుకొన్నాము” అని కన్నీరుమున్నీరయ్యారు. ఇక 1666లో ఔరంగజేబు పుట్టినరోజు సందర్భంగా ఆగ్రా వెళ్లిన శివాజీని మొఘలులు కుట్రపూరితంగా బంధించారు. అయితే, పండ్ల బుట్టల్లో దాక్కొని తన కొడుకు శంభాజీతో కలిసి ఆయన మొఘలుల కళ్లుగప్పి తప్పించుకున్న తీరు నేటికీ ఒక అద్భుత ఘట్టమే.

ఇది కూడా చదవండి :  Dr Babasaheb Ambedkar | విశ్వరత్న డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ చరిత్రాత్మక ప్రసంగం

మతసామరస్యానికి ప్రతీక.. కొలువులో ముస్లింలకే పెద్దపీట

శివాజీని నేడు కేవలం హిందూ పాలకుడిగా మాత్రమే ప్రొజెక్ట్ చేస్తున్నప్పటికీ, వాస్తవానికి ఆయన గొప్ప లౌకికవాది. ఆయన పాలనలో ఎన్నో మసీదులు నిర్మించబడ్డాయి. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యాలలోని స్త్రీలను ఆయన తల్లీచెల్లెళ్లుగా గౌరవించి సురక్షితంగా వెనక్కి పంపేవారు.

ఆయన సైన్యంలో ఏకంగా మూడొంతుల మంది ముస్లింలే ఉండటం విశేషం. సర్వ సైన్యాధ్యక్షులుగా దౌలత్‌ ఖాన్‌, సిద్దిక్ పని చేయగా.. నావికాదళానికి ఇబ్రహీం ఖాన్, మందుగుండు విభాగానికి సిద్ది ఇబ్రహీం నాయకత్వం వహించారు. శివాజీ ప్రాణాలు కాపాడిన అంగరక్షకుడు మదానీ మెహ్తర్‌ కూడా ఒక ముస్లిమే కావడం ఆయన మతసామరస్యానికి నిదర్శనం.

ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ ప్రయాణం కేవలం కత్తితో చేసిన యుద్ధం మాత్రమే కాదు, సామాజిక వివక్షపై చేసిన పోరాటం కూడా. మతం, కులం కంటే దేశభక్తి, ప్రజల సంక్షేమమే ముఖ్యమని నమ్మిన ఆయన పాలనా విధానం, వ్యూహాత్మక దార్శనికత నేటి తరానికి, పాలకులకు ఎప్పటికీ ఆదర్శప్రాయమే.

చరిత్ర గతిని మార్చిన ఆ రెండు భీకర దాడులు ఇవే..

ఛత్రపతి శివాజీ మహారాజ్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన యుద్ధ నైపుణ్యం. శత్రువుల సైన్యం ఎంత పెద్దదైనా, తన వ్యూహాలతో వారిని మట్టికరిపించిన తీరు యుద్ధ చరిత్ర పుస్తకాలలో ఇప్పటికీ ఒక అద్భుతమే. శివాజీ ఎదుగుదలను జీర్ణించుకోలేని బిజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా, ఎలాగైనా శివాజీని మట్టుబెట్టాలని తన అత్యంత క్రూరమైన, బలమైన సేనాని ‘అఫ్జల్ ఖాన్’ను పంపాడు. అఫ్జల్ ఖాన్ కుట్రలు ముందే పసిగట్టిన శివాజీ, ప్రతాప్‌గఢ్ కోట వద్ద చర్చలకు ఆహ్వానించారు.

ఇది కూడా చదవండి :  Sant Sevalal Maharaj | దేశంలోని పదిహేను కోట్ల బంజారాల ఆరాధ్య దైవం

చర్చల సమయంలో ఏడడుగుల అఫ్జల్ ఖాన్.. శివాజీని కౌగిలించుకునే నెపంతో తన బాకుతో పొడిచే ప్రయత్నం చేశాడు. అయితే ముందే అప్రమత్తంగా ఉండి, దుస్తుల లోపల ఉక్కు కవచం ధరించిన శివాజీ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. క్షణాల వ్యవధిలో తన చేతికి ఉన్న ‘వ్యాఘ్రనఖం’ (పులి గోర్లు లాంటి ఆయుధం)తో అఫ్జల్ ఖాన్ పొట్ట చీల్చి వధించారు. నాయకుడు చనిపోవడంతో బిజాపూర్ సైన్యంలో గందరగోళం నెలకొంది. అదే అదనుగా ప్రతాప్‌గఢ్ చుట్టూ ఉన్న దట్టమైన అడవుల్లో ముందే మాటువేసిన మరాఠా సైన్యం, గెరిల్లా దాడితో బిజాపూర్ సేనలను ఊచకోత కోసింది. ఈ ప్రతాప్‌గఢ్ యుద్ధం (1659) మరాఠా సామ్రాజ్య చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్.

మొఘలుల గుండెల్లో గుబులు.. సూరత్ నగరంపై సంచలన దాడి!

మొఘల్ సామ్రాజ్యానికి అప్పట్లో ప్రధాన ఆదాయ వనరు, అత్యంత సంపన్న నగరమైన సూరత్ (గుజరాత్). మొఘల్ సేనాని షైస్తా ఖాన్ పూణేపై చేసిన దాడుల వల్ల మరాఠా ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది. దీనికి ప్రతీకారంగా, అలాగే స్వరాజ్య స్థాపనకు అవసరమైన నిధుల కోసం శివాజీ మాస్టర్ ప్లాన్ వేశారు. 1664లో శివాజీ తన సైన్యంతో కలిసి మెరుపు వేగంతో మొఘలుల గుండెకాయ లాంటి సూరత్ నగరంపై దాడి చేశారు.  మొఘల్ సైన్యం తేరుకునే లోపే దాదాపు వారం రోజుల పాటు నగరాన్ని తమ ఆధీనంలో ఉంచుకొని, భారీ ఎత్తున సంపదను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ దాడిలో సామాన్య ప్రజలను, స్త్రీలను, ఇతర మతస్తుల ప్రార్థనా మందిరాలను ఏమాత్రం ఇబ్బంది పెట్టకపోవడం శివాజీ ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. ఈ సూరత్ దాడితో ఔరంగజేబు అహంకారం దెబ్బతినడమే కాకుండా, శివాజీ పేరు ఉత్తర భారతదేశం మొత్తం మార్మోగిపోయింది.

ఇది కూడా చదవండి :  Bahadur Shah Zafar | బహదూర్ షా చేసిన సేవ – భారత స్వాతంత్ర్యానికి చివరి మొఘల్ చక్రవర్తి పాత్ర

శివాజీ మహారాజ్ కేవలం ఒక పాలకుడు మాత్రమే కాదు.. కాలానికి మించిన దార్శనికుడు. శత్రువుల బలహీనతలను పసిగట్టి దెబ్బకొట్టడంలో ఆయన వ్యూహాలు అద్వితీయం. కుల వివక్షలు, అడుగడుగునా ద్రోహాలు ఎదురైనా.. తన లక్ష్యం (స్వరాజ్యం) దిశగా ఆయన సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకం. ఆధునిక సైనిక వ్యవస్థలకు ఆయన పరిచయం చేసిన నౌకాదళం, గూఢచారి వ్యవస్థలు నేటికీ ఆచరణీయమే.

Disclaimer: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం విశ్వసనీయ మూలాల నుండి సేకరించబడింది. ఇది కేవలం జ్ఞానార్థం, ఏ వ్యక్తిగత అభిప్రాయం లేదా కలపనుండని అర్థం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page