📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeAndhra Pradeshcyclone montha effect | భూభాగంలో మోంథా ప్రళయం.. తీరం దాటాక బలహీనం

cyclone montha effect | భూభాగంలో మోంథా ప్రళయం.. తీరం దాటాక బలహీనం

కోస్తాంధ్రలో విధ్వంసం.. రాడార్ ఫ్రేమ్‌లలో కుండపోత వర్షాల తీవ్రత.!

వాస్తవ నేస్తం,అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ను భయపెట్టిన మోంథా తుఫాన్ తీరం దాటింది. తీరం దాటిన తర్వాత (cyclone montha effect) భూమిపైకి కదిలే కొద్దీ క్రమంగా బలహీనపడినప్పటికీ, కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం ఇది తీవ్ర వర్షపాతాన్ని మిగిల్చింది. ఈ మొత్తం తుఫాన్ కదలిక, వాయు వేగం, వర్ష తీవ్రతను భారత వాతావరణ శాఖ (IMD) యొక్క డోప్లర్ వెదర్ రాడార్ (DWR) నెట్‌వర్క్ చాలా వివరంగా నమోదు చేసింది.

సముద్రంలో కదిలిన భూతం : అక్టోబర్ 27వ తేదీ మధ్యాహ్నం 1:30 నుంచి 4:30 గంటల మధ్య నుంచే మచిలీపట్నం, విశాఖపట్నం డోప్లర్ రాడార్‌ లు ఈ తుఫాన్‌ను ట్రాక్ చేయడం మొదలుపెట్టాయి. ఆ సమయంలో తుఫాన్ కేంద్రం మచిలీపట్నానికి దూరంగా ఉన్నప్పటికీ, రాడార్ ఫ్రేమ్‌లలో మెలికలు తిరిగినట్లు కనిపించిన భారీ వర్షపు మేఘాల గుంపు… తుఫాన్ ఎంతటి ఉగ్రరూపం దాల్చనుందో స్పష్టం చేసింది. ఇంకా బలపడుతున్న భారీ మేఘాలు ఆవిర్భవించడం, తుఫాన్ వేగం పుంజుకోవడం రాడార్ చిత్రాలలో రికార్డయింది.

తీరం తాకిన ప్రళయం.!

భయంకరంగా ఎదురుచూసిన సమయం వచ్చింది. అక్టోబర్ 28న సాయంత్రం 7 గంటలకు తీరం దాటే ప్రక్రియ మొదలవగా, రాత్రి 11:30 నుంచి తెల్లవారుజామున 12:30 గంటల మధ్య కాకినాడకు దక్షిణాన, నర్సాపూర్ సమీపంలో తుఫాన్ పూర్తిగా తీరాన్ని తాకింది. రియల్-టైమ్ డోప్లర్ రాడార్ అందించిన సమాచారం ప్రకారం, ఈ ల్యాండ్‌ఫాల్ సమయంలో కుండపోత వర్షం తీవ్రత గరిష్ట స్థాయికి చేరింది. రాడార్ ఫ్రేమ్‌లలో కనిపించిన బలమైన గాలుల కదలిక ఆధారంగా, తీరప్రాంతంలో గంటకు 100 కి.మీ.లకు పైగా వేగంతో గాలులు వీచినట్లు ధ్రువీకరించబడింది. తుఫాన్ మధ్యభాగం (కన్ను) తీరాన్ని దాటే దృశ్యం రాడార్లలో స్పష్టంగా కనిపించింది.

ఇది కూడా చదవండి :  Karnataka High court | ఇద్దరి అంగీకారంతో జరిగిన లైంగిక క్రియ నేరం కాదు : కర్ణాటక హైకోర్టు

బలహీనపడి… వర్షాన్ని కుమ్మరించి.!

అయితే, భూభాగంపైకి ప్రవేశించిన తర్వాత ‘మోంథా’ శక్తి తగ్గింది. అక్టోబర్ 29 తెల్లవారుజామున రాడార్ ట్రాకింగ్ చిత్రాలు తుఫాన్ నిర్మాణం బలహీనపడటాన్ని, దట్టమైన మేఘాలు చెల్లాచెదురు కావడాన్ని చూపించాయి. భారీ వర్షాలు కురిపించే వ్యవస్థ తగ్గిపోవడంతో, రాడార్ ఫ్రేమ్‌లు తుఫాన్ తన తీవ్రతను కోల్పోతున్నట్లు నివేదించాయి. బలహీనపడినప్పటికీ, అది మిగిల్చిన వర్షపాతం మాత్రం పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు పలు ప్రాంతాలను ముంచెత్తింది. మోంథా వెళ్లిపోయినా, అది కుమ్మరించిన వర్షంతో కోస్తాంధ్రలో సాధారణ జీవితం ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటోంది. అయినా వర్షం, గాలులు ఇంకా ఉదృతంగానే ఉన్నాయి. రియల్ టైం కమాండ్ సెంటర్ నుండి ప్రభుత్వ పర్యవేక్షణ, గ్రౌండ్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page