HomeTelanganaరైల్వే రీసర్వేలో నేరడిగొండకు అన్యాయం చేయొద్దు

రైల్వే రీసర్వేలో నేరడిగొండకు అన్యాయం చేయొద్దు

📰 Generate e-Paper Clip

• సాబ్లే సామాజిక కార్యకర్త సంతోష్ సింగ్ హెచ్చరిక

 

వాస్తవ నేస్తం,నేరడిగొండ : ఆదిలాబాద్ – నిర్మల్ – ఆర్మూర్ ప్రతిపాదిత రైల్వే లైన్ రీసర్వేలో నేరడిగొండ మండలాన్ని విస్మరించడం తీవ్ర అన్యాయమని సామాజిక కార్యకర్త సాబ్లే సంతోష్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. నేరడిగొండ మీదుగా రైల్వే లైన్ నిర్మించడంతో పాటు ఇక్కడ జంక్షన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నేరడిగొండ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సర్పంచులు వాగ్దారి విజయ్, వెంకటపూర్ వెంకట్ రాం, పాలియడ్ రమేష్, మాలి సంతోష్‌లతో కలసి అధికారులకు మెమోరాండం సమర్పించారు.

ఈ సందర్భంగా సంతోష్ సింగ్ మాట్లాడుతూ.. బరంపూర్ నుంచి బజార్‌హత్నూర్, సోనాల, పొచ్చెర, కుచులాపూర్ మీదుగా సారంగపూర్ వైపు రైల్వే మార్గాన్ని మళ్లించేందుకు ప్రచారం జరుగుతోందని, ఇది అమలైతే నేరడిగొండ రైల్వే సౌకర్యానికి దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కుప్టి, మహబూబ్ ఘాట్ల కారణంతో నిర్మాణ వ్యయం పెరుగుతుందని సాంకేతిక సాకులు చూపడం సమంజసం కాదన్నారు. ఆధునిక యుగంలో కొండలు తొలచి సొరంగాలు, లోయలపై భారీ వంతెనలు నిర్మిస్తున్నారని గుర్తుచేశారు.

నేరడిగొండ పరిధిలోని కుంటాల, పొచ్చెర, వాస్తాపూర్, కోరటికల్ జలపాతాలు, మహబూబ్ ఘాట్ వంటి పర్యాటక ప్రాంతాలు, కుప్టి ప్రాజెక్టును దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఇక్కడ రైల్వే లైన్, జంక్షన్ ఏర్పాటు చేస్తే రవాణా సౌకర్యాలు పెరిగి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. రైల్వే శాఖ ఈ రీసర్వేపై స్పష్టత నివ్వాలని, నేరడిగొండకు న్యాయం జరగకపోతే పార్టీలకు అతీతంగా అఖిలపక్షంతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో వెంటనే చేరండి!

జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular