వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ఇటీవలి కాలంలో వెండి మార్కెట్‌లో ఊహించని స్థాయిలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు బంగారానికి ప్రత్యామ్నాయంగా భావించిన వెండి ఇప్పుడు ధరల విషయంలో బంగారాన్ని మించే స్థాయికి చేరుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్ కారణంగా వైట్ మెటల్ ధరలు భారీగా ఎగబాకుతున్నాయి.
ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2.51 లక్షలకు మించి పలుకుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు మోసాల బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటికే బంగారానికి తప్పనిసరిగా అమలులో ఉన్న హాల్‌మార్కింగ్ విధానాన్ని వెండికీ వర్తింపజేయాలన్న ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి.
ఇప్పటివరకు వెండి ఆభరణాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి కాకపోయినా, ధరలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగానే వెండికీ హాల్‌మార్కింగ్ అవసరమన్న డిమాండ్ పరిశ్రమ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది.
ఈ అంశంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ జనరల్ సంజయ్ గార్గ్ స్పందిస్తూ, కొత్త నిబంధనలు రూపొందించే ముందు అవసరమైన వనరులు, ల్యాబ్ సామర్థ్యం, మార్కెట్ పరిస్థితులపై సమగ్ర అంచనా వేయనున్నట్లు తెలిపారు. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం వెండి హాల్‌మార్కింగ్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

ఒకవేళ ఈ విధానం అమల్లోకి వస్తే, వెండి కొనుగోలు చేసే వినియోగదారులకు నాణ్యతపై మరింత భరోసా కలగనుంది. అలాగే వెండి మార్కెట్‌లో పారదర్శకత పెరిగి, నకిలీ లేదా తక్కువ నాణ్యత ఉత్పత్తులకు అడ్డుకట్ట పడే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Author: QAMAR SD

