ఇటీవల వెండి ధరలు భారీ హెచ్చుతగ్గులతో మార్కెట్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. కొన్ని నెలలుగా వెండి కూడా బంగారంతో పోటీ పడుతూ ఆల్‌టైమ్ హై స్థాయిలను తాకింది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్స్, సరఫరా మధ్య అంతరం పెరగడంతో, 2025 నాటికి వెండి ధరలు దాదాపు 170–180 శాతం వరకు పెరిగినట్లు మార్కెట్ అంచనాలు చెబుతున్నాయి.
చరిత్ర చెబుతున్న హెచ్చరిక :
గతాన్ని పరిశీలిస్తే వెండి ధరలు ఎప్పుడూ ఒకే దిశలో సాగలేదని తెలుస్తోంది. 1980, అలాగే 2011 కాలంలో భారీ ర్యాలీ తర్వాత వెండి ధరలు గణనీయంగా పడిపోయాయి. ఇప్పుడు కూడా అదే తరహా సైకిల్ తిరిగి వచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్న పెట్టుబడిదారుల్లో నెలకొంది.
మార్కెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, ప్రస్తుత ధరల పెరుగుదల తరువాత 2027 ఆర్థిక సంవత్సరం నాటికి వెండి ధరలు 50–60 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
పారిశ్రామిక డిమాండే కీలక కారణం :
వెండి డిమాండ్‌లో పెద్ద భాగం పారిశ్రామిక వినియోగం నుంచే వస్తుంది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ టెక్నాలజీ వంటి రంగాల్లో వెండి వినియోగం పెరగడం ధరలకు ఇప్పటివరకు బలమైన మద్దతునిచ్చింది.
కానీ ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారుతోంది. లిథియం-అయాన్ బ్యాటరీల నుంచి సాలిడ్-స్టేట్ బ్యాటరీల వైపు పరిశ్రమలు మారుతున్న నేపథ్యంలో, వెండికి ప్రత్యామ్నాయాలపై పరిశోధన పెరుగుతోంది.
వెండికి బదులుగా రాగి.?
ధరలు అధికంగా ఉండటంతో అనేక కంపెనీలు వెండికి బదులుగా రాగి (Copper) వంటి లోహాలను వినియోగించే దిశగా అడుగులు వేస్తున్నాయి. చైనా, ఆస్ట్రేలియా, తైవాన్, ఇజ్రాయెల్ వంటి దేశాల్లోని కొన్ని టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికే కొత్త బ్యాటరీ డిజైన్లలో రాగి వినియోగాన్ని పెంచుతున్నాయి.
పరిశ్రమలు పెద్ద ఎత్తున ప్రత్యామ్నాయాలకు మారితే, వెండి డిమాండ్ తగ్గి ధరలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
ధరలు ఎంతవరకు పడిపోవచ్చు.?
కొంతమంది మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, వెండి ధరలు తాత్కాలికంగా ఔన్సుకు $100 వరకు చేరే అవకాశం ఉన్నా, ఆ తరువాత తీవ్ర కరెక్షన్ రావచ్చని చెబుతున్నారు. 2027 చివరి నాటికి వెండి ధరలు ఔన్సుకు $40 స్థాయికి కూడా పడిపోవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో రిటైల్ పెట్టుబడిదారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక లాభాల ఆశతో తొందరపడి వెండి కొనుగోలు చేయడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. కొత్త పెట్టుబడులకు ముందు ధరల స్థిరత్వం, అంతర్జాతీయ ట్రెండ్స్‌ను గమనించడం అవసరమని సూచిస్తున్నారు.
ప్రస్తుతం వెండి ధరలు బలంగా కనిపిస్తున్నప్పటికీ, దీర్ఘకాలంలో తీవ్ర ఒడిదుడుకుల ప్రమాదం ఉందని మార్కెట్ సంకేతాలు ఇస్తున్నాయి. కాబట్టి వెండి పెట్టుబడుల విషయంలో భావోద్వేగాలకంటే సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
– Qamar SD
