• రూ. 20 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డఎస్సై అశోక్
వాస్తవ నేస్తం,నిర్మల్ : శాంతిభద్రతలను పరిరక్షించి, అవినీతిని అరికట్టాల్సిన ఒక బాధ్యతాయుతమైన అధికారి ఏసీబీ వలలో చిక్కారు. ఓ సివిల్ వ్యవహారంలో అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్ చేసిన నిర్మల్ జిల్లా మమడ ఎస్సై అశోక్ గురువారం ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. స్థానిక సమాచారం ప్రకారం.. ఒక రియల్టర్ వ్యవహారానికి సంబంధించి మధ్యవర్తిత్వం వహించేందుకు, సదరు వ్యక్తికి అనుకూలంగా ఫైల్ కదిలించేందుకు ఎస్సై అశోక్ ₹40,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడు తన ఇబ్బందులను వివరించగా, చివరకు ₹20,000 ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలోని బృందం పక్కా పథకం ప్రకారం గురువారం మమడ పోలీస్ స్టేషన్లో మాటు వేశారు.
బాధితుడి నుంచి ఎస్సై అశోక్ నగదు తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు. ఆయన చేతులకు రసాయన పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా రావడంతో అధికారులు నగదును స్వాధీనం చేసుకున్నారు.
చట్టాన్ని కాపాడాల్సిన వారే ఇలా అక్రమ మార్గంలో వెళ్తే సహించేది లేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ దాడులు నిర్వహించాం. ఎస్సైపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఈ ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. నిర్మల్ జిల్లా మమడ పోలీస్ స్టేషన్లో ఎస్సై స్థాయిలో ఉన్న అధికారి ఇలా దొరికిపోవడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

