* ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురైన యువకుడు ఉమేర్ ఖురేషీ
* తీవ్ర గాయాలతో హైదరాబాద్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాటం
* కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న యువకుడికి అండగా నిలవాలని ప్రభుత్వం, దాతలకు వేడుకోలు
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: అతను రోజంతా కష్టపడి పనిచేస్తేనే ఆ ఇంట్లో పొయ్యి వెలిగేది. వృద్ధాప్యంలో ఉన్న తల్లికి, భార్యకు, పసిపిల్లలకు అతనే ఏకైక ఆధారం. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడిన అలసట తీర్చుకోవడానికి సాయంత్రం వేళ ఓ కప్పు టీ తాగుదామని వెళ్లిన ఆ యువకుడిని విద్యుత్ షాక్ రూపంలో మృత్యువు కాటేసింది. ప్రస్తుతం ఆ యువకుడు హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఉమేర్ ఖురేషీ రోజువారీ పనులతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శుక్రవారం సాయంత్రం పనులు ముగించుకుని సేద తీరేందుకు మండల కేంద్రంలోని షారుక్ గార్డెన్ సమీపంలో ఉన్న టీ కొట్టు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురికావడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి మెరుగైన వైద్యం కోసం అతడిని హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించారు.
దిక్కుతోచని స్థితిలో కుటుంబం:
ప్రస్తుతం ఉమేర్ ఖురేషీ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వైద్య ఖర్చులు తలకు మించిన భారంగా మారడంతో ఆ పేద కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. “మా ఇంట్లో సంపాదించే వ్యక్తి అతనొక్కడే. తల్లి, భార్య, పిల్లలమంతా అతని కష్టంపైనే ఆధారపడి బతుకుతున్నాం. ఇప్పుడు ఆసుపత్రి ఖర్చులు భరించే స్థోమత మాకు లేదు” అంటూ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
చావుబతుకుల మధ్య పోరాడుతున్న ఉమేర్ ఖురేషీ ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్నారు.
🔴 తాజా వార్తలు, బ్రేకింగ్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో వెంటనే చేరండి!
జాయిన్ వాస్తవ నేస్తం WhatsApp ఛానల్