• బీఫ్(ఎద్దు మాంసం)పేరిట ఆవు మాంసం విక్రయిస్తున్నట్లు ఆరోపణలు.!?
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: నియమ నిబంధనలు తుంగలో తొక్కి, అధికారుల కళ్లు గప్పి ఇచ్చోడ మండల కేంద్రంలో గోవధ యధేచ్ఛగా సాగుతోందని ఆరోపణలు ఉన్నాయి. పవిత్రంగా భావించే ఆవులను గుట్టుచప్పుడు కాకుండా వధించి, ఆ మాంసాన్ని ఎద్దు మాంసంగా చిత్రీకరిస్తూ విక్రయిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. రాత్రి వేళల్లో , చీకటిగా ఉన్నప్పుడు రహస్య ప్రాంతాల్లో ఈ దందా సాగుతున్నట్లు చర్చ జరుగుతుంది. పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గుర్తు పట్టకుండా ‘మాయా’ జాలం..!??
సాధారణంగా ఆవు మాంసానికి, బీఫ్ కు (ఎద్దు మాంసం) మధ్య ఉండే వ్యత్యాసాన్ని సామాన్యులు గుర్తించడం కష్టం. దీన్నే ఆసరాగా చేసుకుంటున్న అక్రమార్కులు, ఆవులను వధించిన తర్వాత కొన్ని శరీర భాగాలను వ్యూహాత్మకంగా తొలగిస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. ఆ మాంసం ఆవుదా..? లేక ఎద్దుదా..? అని గుర్తు పట్టలేనంతగా మార్పులు చేసి విక్రయిస్తారు. వినియోగదారులను నమ్మించి అడ్డగోలుగా లాభాలు గడిస్తున్నారు.
ఎవరి కంటా పడకుండా ఉండేందుకు ఈ అక్రమ వ్యాపారస్థులు రాత్రి సమయాన్ని , లేదా తెల్లవారుజాము సమయాన్ని ఎంచుకుంటున్నారు. చీకటి ఉన్నప్పుడే జనావాసాలకు దూరంగా ఉన్న రహస్య ప్రాంతాల్లో గోవులను వధించి, తెల్లవారేసరికి విక్రయ కేంద్రాలకు మాంసాన్ని తరలిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక ప్రజలు పలుమార్లు అనుమానం వ్యక్తం చేసినా, ఎవరి భయం లేకుండా ఈ దందా నిరాటంకంగా కొనసాగుతుండటం గమనార్హం.
ఈ అక్రమ గోవధ వ్యవహారంపై అధికారుల దృష్టి సారించి, సంబంధిత శాఖ అధికారులు తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కబేళాలపై దాడులు నిర్వహించి, అక్రమంగా గోవులను తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇచ్చోడలో సాగుతున్న ఈ ‘చీకటి’ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని, పర్యావరణం మరియు ప్రజల మనోభావాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
