• విద్యార్థుల భవితతో చెలగాటం.. వరుసగా 18 సార్లు పరీక్షల వాయిదాలు, రద్దులు!
• పేపర్ లీకేజీల వెనుక అసలు సూత్రధారులు ఎవరు..?
• చోద్యం చూస్తున్న ప్రభుత్వం..!
అహోరాత్రులు నిద్రకాయలు కాచి చదివారు.. తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజులు కట్టారు.. తీరా పరీక్ష రాసి, మంచి ర్యాంకు వస్తుందన్న ఆశతో ఉన్న విద్యార్థుల నెత్తిన ‘పేపర్ లీక్’ అనే పిడుగు పడింది. ఇటీవల పేపర్ లీక్ ఆరోపణలతో రద్దయిన పరీక్షల వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల పాలిట శాపంగా మారింది. తెలంగాణలో 71 వేల మంది, ఆంధ్రప్రదేశ్‌లో 58 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయగా.. వారి కష్టం కాస్తా క్షణాల్లో బూడిదలో పోసిన పన్నీరైంది. అసలు మళ్లీ పరీక్ష ఎప్పుడు పెడతారు? పేపర్ కఠినంగా వస్తుందా? అన్న టెన్షన్ విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో అసలు జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహించే వ్యవస్థల పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
NTA అంటే ఏమిటి..?
NTA (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) అనగా జాతీయ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఒక స్వయంప్రతిపత్తి గల సంస్థ. జాతీయ స్థాయిలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశాల కోసం (ఉదాహరణకు NEET, JEE, UGC NET లాంటివి) అత్యున్నత ప్రమాణాలతో, పూర్తి పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించాలనే ఉత్కృష్టమైన లక్ష్యంతో 2018లో దీనిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ, ప్రస్తుతం ఈ సంస్థ పేరు చెబితేనే విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యే పరిస్థితి నెలకొంది.
18 సార్లు లీకేజీలు, వాయిదాలు.. కారణం ఏంటి..?
2018లో NTA ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 18 సార్లు పలు కీలకమైన పరీక్షలు వాయిదా పడటం లేదా లీకేజీల కారణంగా రద్దు కావడం గమనార్హం. దేశంలోనే అత్యున్నత సాంకేతికత, వనరులు, నిధులు ఉన్న ఒక జాతీయ సంస్థ.. ఒక ప్రశ్నాపత్రాన్ని భద్రంగా ఎందుకు ఉంచలేకపోతోంది..? పట్నాలో నీట్ (NEET)-2024 పేపర్ లీక్ అవ్వడం, ఆ వెంటనే UGC నెట్-2024, ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన NCET-2024 తదితర పేపర్లు వరుసగా లీక్ కావడం వెనుక కారణం ఏంటి? లోపం వ్యవస్థలో ఉందా..? లేక దాన్ని నడిపిస్తున్న నిర్వాహకుల్లో ఉందా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. భద్రతా ప్రమాణాలను పాటించడంలో NTA ఘోరంగా విఫలమైందనేది ఈ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
కావాలని చేస్తున్నారా..? ఇదొక కుట్రనా..?
ఇన్నిసార్లు పేపర్లు లీక్ అవ్వడం చూస్తుంటే ఇదంతా కేవలం సాంకేతిక లోపం వల్లనో, ఒకరిద్దరి నిర్లక్ష్యం వల్లనో జరుగుతున్నట్లు లేదు. దీని వెనుక వేల కోట్ల రూపాయల రాకెట్ నడుపుతున్న ఒక పెద్ద ‘ఎడ్యుకేషన్ మాఫియా’ ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బడా కోచింగ్ సెంటర్లు, దళారులు, సిస్టమ్‌లోని కొందరు అవినీతి అధికారుల కుమ్మక్కు లేకుండా జాతీయ స్థాయి పరీక్షా పత్రాలు పరీక్షకు ముందే బయటకు రావడం అసాధ్యం. అర్హత లేని వారికి దొడ్డిదారిన సీట్లు ఇప్పించి కోట్లు గడించడానికి కొందరు కావాలనే పక్కా ప్రణాళికతో ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్రగా ఇది కనిపిస్తోంది.
ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోంది..? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ప్రతిసారీ పేపర్ లీక్ అవ్వడం, ఆ తర్వాత నిరసనలు వెల్లువెత్తగానే ప్రభుత్వం పరీక్షను రద్దు చేస్తున్నాం అని ఒక ప్రకటన చేయడం.. ఇదే పరిపాటిగా మారింది. పరీక్ష రద్దు చేయడం అంటే తప్పు చేసిన వారిని వదిలేసి, కష్టపడి చదివిన నిజాయితీపరులైన విద్యార్థులను శిక్షించడమే కదా. ! కమిటీలు వేయడం, విచారణల పేరుతో కాలయాపన చేయడం తప్ప.. అసలు సూత్రధారులను పట్టుకుని కఠినంగా శిక్షించిన దాఖలాలు లేవు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఇలాంటి పేపర్ లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపకపోతే, దేశ విద్యావ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుంది. ప్రభుత్వం కేవలం పరీక్షలు రద్దు చేసి చేతులు దులుపుకోకుండా, NTA వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. దోషులకు ఉరిశిక్ష లాంటి కఠినమైన చట్టాలు అమలు చేసినప్పుడే విద్యావ్యవస్థను కాపాడుకోగలం. లేదంటే, మన యువత కన్నీళ్లకు పాలకులే బాధ్యత వహించక తప్పదు.
By.. QAMAR
