📄 ePaper
Thursday, May 21, 2026
📄 ePaper
HomeCrime NewsPocso Act | పిల్లల రక్షణకు బ్రహ్మాస్త్రం పోక్సో చట్టం: మైనర్ల విషయంలో సమ్మతి చెల్లదు..!

Pocso Act | పిల్లల రక్షణకు బ్రహ్మాస్త్రం పోక్సో చట్టం: మైనర్ల విషయంలో సమ్మతి చెల్లదు..!

వాస్తవ నేస్తం,ప్రత్యేక ప్రతినిధి: ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో జరుగుతున్న కొన్ని ప్రచారాల నేపథ్యంలో ‘పోక్సో (POCSO) చట్టం’ పై సర్వత్రా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా మైనర్ల ‘సమ్మతి’ (Consent) విషయంలో చట్టం ఏం చెబుతుందనే దానిపై చాలా మందికి స్పష్టత లేదు. మైనర్ల భద్రత కోసం రూపొందించిన ఈ చట్టం నేరస్తుల పట్ల అత్యంత కఠినంగా ఉంటుంది.

పోక్సో చట్టం అంటే ఏమిటి?

పిల్లలను లైంగిక నేరాల నుండి రక్షించడానికి 2012లో భారత ప్రభుత్వం ‘Protection of Children from Sexual Offences (POCSO)’ చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు ఉన్న వారందరినీ పిల్లలుగానే పరిగణిస్తారు. సాధారణ క్రిమినల్ చట్టాలతో పోలిస్తే ఇది అత్యంత శక్తివంతమైనది.

మైనర్ సమ్మతి (Consent) – చట్టం ఏం చెబుతుంది?

చాలా మంది మైనర్ ఇష్టంతోనే వెళ్ళింది కదా అని వాదిస్తుంటారు. కానీ న్యాయశాస్త్రం ప్రకారం, 18 ఏళ్ల లోపు వారు ఇచ్చే ‘సమ్మతి’కి విలువ లేదు. వారికి ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకునే మానసిక పరిణతి ఉండదని చట్టం భావిస్తుంది. కాబట్టి, మైనర్ ఇష్టంతో జరిగినా, బలవంతంగా జరిగినా అది అక్షరాలా నేరమే. ఇక్కడ “అమ్మాయికి ఇష్టమే” అనే వాదన కోర్టులో చెల్లదు.

బడెన్ ఆఫ్ ప్రూఫ్ (Burden of Proof)

సాధారణ కేసులలో నిందితుడు తప్పు చేశాడని పోలీసులు నిరూపించాల్సి ఉంటుంది. కానీ పోక్సో కేసులో నిందితుడే తాను నిర్దోషినని నిరూపించుకోవాలి. అప్పటి వరకు అతను నిందితుడిగానే పరిగణించబడతాడు. అందుకే ఈ చట్టం నిందితుల పట్ల ఏమాత్రం కనికరం చూపదు.

నేరాలు మరియు శిక్షల తీవ్రత

నేర తీవ్రతను బట్టి ఈ చట్టంలో కఠినమైన శిక్షలు ఉన్నాయి:

  • లైంగిక వేధింపులు: 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష.
  • తీవ్రమైన లైంగిక దాడి: కనికరం లేని నేరాలకు 20 ఏళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు లేదా మరణశిక్ష (ఉరి) పడే అవకాశం ఉంది.
  • పోర్నోగ్రఫీ: పిల్లలతో అశ్లీల చిత్రాలు తీయడం లేదా వాటిని కలిగి ఉండటం కూడా శిక్షార్హమైన నేరం.

సమాచారం దాచడం కూడా నేరమే!

పిల్లలపై అఘాయిత్యం జరుగుతున్నట్లు తెలిసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకపోతే, అది కూడా నేరం కిందకే వస్తుంది. సమాచారాన్ని దాచిన వారికి 6 నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే బాధితుల వివరాలను, ఫోటోలను సోషల్ మీడియాలో బయటపెట్టడం చట్టరీత్యా నేరం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular