వాస్తవ నేస్తం,బిజినెస్ డెస్క్: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలను తాకుతూ పరుగులు పెడుతున్నాయి. ఈ ఏడాది మొత్తం గోల్డ్ రేట్లు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో మరో లోహం బంగారం, వెండికి పోటీగా మారుతోంది. అదే రాగి (Copper).
బంగారం, వెండి ధరలు సామాన్యుడికి అందని స్థాయికి చేరుతుండటంతో పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో కాపర్‌పై డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా రాగి ధరలు కూడా బంగారం, వెండితో సమానంగా భారీ ర్యాలీ కొనసాగిస్తున్నాయి.
ఆల్ టైం హైకి చేరిన కాపర్ ధరలు
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో కాపర్ ఫ్యూచర్స్ ధరలు తాజాగా 1.30 శాతం కంటే ఎక్కువగా పెరిగి కిలోకు రూ.1,330.45 వద్ద ట్రేడయ్యాయి. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్థాయి. గతంలో రూ.913.70 కనిష్ట స్థాయి నుంచి నెమ్మదిగా ఊపందుకున్న రాగి ధరలు, డిసెంబర్ ప్రారంభం నుంచి వేగంగా పెరిగి జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లోనూ కాపర్ ధరలు టన్నుకు 13 వేల డాలర్లను దాటుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ ర్యాలీకి ఒక్క కారణం కాదు, పలు అంశాలు కలిసి పనిచేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఎందుకు పెరుగుతోంది? కొత్త వెండిగా మారుతుందా?
ప్రపంచవ్యాప్తంగా కాపర్ సరఫరా తగ్గడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలు, రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, ఏఐ డేటా సెంటర్లు, విద్యుత్ గ్రిడ్ అప్‌గ్రేడ్స్ వంటి రంగాల నుంచి డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీనివల్ల రాగిలో నిర్మాణాత్మక లోటు ఏర్పడి ధరలు ఎగబాకుతున్నాయి.
ఇప్పటికే వెండి పారిశ్రామిక లోహంగా ఎంత ముఖ్యమో, అదే స్థాయిలో రాగి కూడా కీలకంగా మారుతోంది. ఆర్థిక అనిశ్చితి సమయంలో బంగారం, వెండికి డిమాండ్ పెరిగినట్లే, ఇప్పుడు కాపర్‌పైనా పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో మార్కెట్ వర్గాలు రాగిని ‘కొత్త వెండి’గా పిలవడం ప్రారంభించాయి.

భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో రాగి ధరలు రానున్న రోజుల్లో మరింత హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే డిమాండ్ బలంగా ఉన్నంత వరకు కాపర్ ర్యాలీకి ఇప్పట్లో బ్రేక్ పడే సూచనలు కనిపించడం లేదని మార్కెట్ విశ్లేషణ చెబుతోంది.
Author: QAMAR SD
